Chandrababu Naidu: కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ వ్యూహం.. ఏపీకి నిధులు రాబట్టాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu Naidu Directs TDP MPs on Central Budget Strategy
  • పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ
  • ఏపీకి అత్యధిక నిధులు రాబట్టాలని ఎంపీలకు స్పష్టమైన ఆదేశం
  • అమరావతికి రెండో విడత నిధులు, పోలవరం పూర్తికి సహకారం కోరాలని సూచన
  • విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పిలుపు
త్వరలో జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలకు కీలక దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి అత్యధికంగా కేంద్ర నిధులు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎంపీలకు ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలను పార్లమెంట్‌లో బలంగా ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు. ముఖ్యంగా అమరావతి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రెండో విడత నిధులు, పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసేందుకు కేంద్ర సహకారం, విశాఖ రైల్వే జోన్‌కు నిధులు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, జాతీయ రహదారుల వంటి అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "ఇప్పటికే అమరావతికి రూ.15 వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రెండో విడతలో కూడా ఇదే తరహా సాయం కోరుతున్నాం" అని పేర్కొన్నారు. అలాగే, "పోలవరం ప్రాజెక్టును 2027 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాము. ఆ దిశగా కేంద్రం కూడా సహకరించాలి" అని వ్యాఖ్యానించారు.

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, అధిక నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎంపీలందరూ చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం ఆదేశాలతో, బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ వాణిని బలంగా వినిపించేందుకు టీడీపీ ఎంపీలు సిద్ధమవుతున్నారు.
Chandrababu Naidu
TDP
Andhra Pradesh
Central Budget
Amaravati Funds
Polavaram Project
Visakha Railway Zone
AP Funds
Parliament Budget Session
Special Status

More Telugu News