Vijay: టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు 'విజిల్'ను ఆవిష్కరించిన విజయ్

Vijay Reveals TVK Party Election Symbol Whistle
  • టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం
  • నేడు మహాబలిపురంలో కార్యకర్తల సమావేశం
  • సమర శంఖం పూరించిన 'దళపతి' విజయ్
తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైన నటుడు విజయ్, తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ఎన్నికల గుర్తు 'విజిల్'ను ఆవిష్కరించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా, అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

చెన్నై సమీపంలోని మహాబలీపురంలో ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్తల భారీ సమావేశంలో విజయ్ ఈ గుర్తును ప్రకటించారు. వేదికపై స్వయంగా విజిల్ వేసి, రాబోయే ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డీఎంకే పాలనను 'దుష్ట శక్తి' అని, గత ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని 'అవినీతి శక్తి' అని అభివర్ణించారు. "ఈ దుష్ట శక్తి గానీ, ఆ అవినీతి శక్తి గానీ తమిళనాడును పాలించడానికి వీల్లేదు. దానిని ఎదుర్కొనే ధైర్యం టీవీకేకు మాత్రమే ఉంది" అని స్పష్టం చేశారు.

రెండు ద్రావిడ పార్టీలు బీజేపీకి లొంగిపోయాయని విజయ్ ఆరోపించారు. ఏఐఏడీఎంకే బహిరంగంగా లొంగిపోతే, డీఎంకే పరోక్షంగా లొంగిపోయిందని విమర్శించారు. "మేము ఎవరి ఒత్తిడికీ తలొగ్గం. ఈ ముఖం చూస్తే ఒత్తిడికి లొంగేలా ఉందా?" అని ప్రశ్నించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

"2026 ఎన్నికలు కేవలం ఎన్నికలు కావు, అదొక ప్రజాస్వామ్య యుద్ధం. ఈ యుద్ధానికి మీరే నాయకులు, మీరే కమాండర్లు" అని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. సినిమా కెరీర్ పరంగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలను, ఈ నేలను కాపాడటమే తన లక్ష్యమని విజయ్ ఉద్ఘాటించారు. ఎన్నికల సంఘం ఇటీవల టీవీకేకు 'విసిల్' గుర్తును కేటాయించిన విషయం తెలిసిందే.
Vijay
Thalapathy Vijay
TVK
Tamilaga Vetri Kazhagam
Tamil Nadu politics
Whistle election symbol
DMK
AIADMK
2026 elections
political party

More Telugu News