Sanju Samson: సంజూకి డేంజర్ బెల్స్... రేసులోకి దూసుకొచ్చిన ఇషాన్ కిషన్!

Sanju Samson failing Ishan Kishan shines in T20 series
  • ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్‌తో సంజూ శాంసన్ ఓపెనింగ్ స్థానంపై ఒత్తిడి
  • అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్‌గా వస్తున్న సంజూ వరుసగా విఫలం
  • ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఓపెన‌ర్
  • వరల్డ్ కప్ తుది జట్టులో స్థానానికి కివీస్‌ సిరీస్ సంజూకి కీలకం
  • శాంసన్ టెక్నిక్‌పై మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీ20 వరల్డ్ కప్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ టీమిండియాలో ఓపెనింగ్ స్థానంపై ఆసక్తికర చర్చ మొదలైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా సంజూ శాంసన్ వరుసగా విఫలమవుతుండగా, మరోవైపు ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 76) మెరుపు ఇన్నింగ్స్‌తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. దీంతో అభిషేక్ శర్మకు జోడీగా ఎవరిని బరిలోకి దించాలనే దానిపై తీవ్ర చ‌ర్చ కొన‌సాగుతోంది.

టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టి మరీ సంజూ శాంసన్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ ఓపెనర్‌గా అవకాశాలు ఇచ్చింది. గతంలో ఐదు మ్యాచ్‌లలో మూడు సెంచరీలు సాధించిన రికార్డుతో జట్టులోకి వచ్చిన శాంసన్, తనకిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లలో కేవలం 10, 6 పరుగులకే ఔటయ్యాడు. ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో అతని బలహీనత మరోసారి బయటపడింది. గతంలో ఇంగ్లండ్‌ సిరీస్‌లోనూ జోఫ్రా ఆర్చర్ వంటి ఫాస్ట్ బౌలర్ల చేతిలో అవుటై తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరాడు.

ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ డబ్ల్యూవీ రామన్.. శాంసన్ బ్యాటింగ్ టెక్నిక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "బంతి వేగానికి తగ్గట్టు బ్యాట్ స్వింగ్ వేగాన్ని సర్దుబాటు చేసుకోనంత వరకు శాంసన్ నిలకడగా రాణించలేడు. ఒక కారును అన్నిచోట్లా, అన్ని సమయాల్లో ఒకే వేగంతో నడపలేం కదా" అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పోస్ట్ చేశాడు.

ఇక‌, స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న‌ వరల్డ్ కప్ టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఉన్న భారత్‌కు ఈ సిరీస్ కీలకం. జట్టు కూర్పు దాదాపు ఖరారైనప్పటికీ, ఓపెనింగ్ స్థానంపై నెలకొన్న ఈ పోటీ తలనొప్పిగా మారింది. ఇవాళ‌ జరిగే మూడో టీ20లో రాణించకపోతే సంజూ శాంసన్ ప్రపంచకప్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది.
Sanju Samson
Ishan Kishan
T20 World Cup
India Cricket
Shubman Gill
WV Raman
New Zealand series
Indian team
opening batsman
Abhishek Sharma

More Telugu News