Harish Rao: సైట్ విజిట్ రూల్ పెట్టిన టెండర్లన్నీ రద్దు చేయాలి: హరీశ్ రావు

Harish Rao Demands Cancellation of Tenders with Site Visit Rule
  • ఆ నిబంధన తొలి లబ్దిదారు సృజన్ రెడ్డి అని ఆరోపణ
  • బొగ్గు స్కాం బయటపెట్టినందుకు తమపై బురద జల్లుతున్నారని ఫైర్
  • తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత
బొగ్గు గనుల టెండర్లలో అక్రమాలను తాము బయటపెట్టడంతో ప్రభుత్వం నైనీ టెండర్లను రద్దు చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. అయితే, ఈ బొగ్గు కుంభకోణం బయటపెట్టినందుకు తమపై కక్షగట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లుతోందని ఆయన ఆరోపించారు. 2018 నుంచే టెండర్ల ఖరారుకు సైట్ విజిట్ నిబంధన ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 

భట్టి విక్రమార్క తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బొగ్గు స్కామ్ నుంచి రేవంత్ రెడ్డిని బయటపడేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. నిజానికి 2025 మేలో సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ నిబంధన వచ్చిందని హరీశ్ రావు చెప్పారు. ఈ నిబంధన వల్ల లబ్ది పొందిన మొదటి వ్యక్తి సృజన్‌ రెడ్డి అని చెప్పారు.

సృజన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ బంధువు కావడంతో టెండర్లలో ఎలాంటి స్కామ్ జరగలేదంటూ భట్టి విక్రమార్క ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎలాంటి స్కాం జరగనప్పుడు నైనీ టెండర్లు ఎందుకు రద్దు చేశారని హరీశ్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. నైనీ టెండర్లు మాత్రమే కాదు.. సైట్‌ విజిట్‌ విధానం అమలు చేసిన టెండర్లన్నీ రద్దు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
Harish Rao
Telangana
BRS
Revanth Reddy
Bhatti Vikramarka
Coal tenders
Naini tenders
Telangana politics
Corruption allegations
Site visit rule

More Telugu News