Chloe Renata: రెండేళ్ల చిన్నారిని అదుపులోకి తీసుకున్న ఐసీఈ.. మినియాపాలిస్‌లో ఉద్రిక్తత!

Chloe Renata 2 year old detained by ICE in Minneapolis sparks outrage
  • తండ్రితో వెళ్తున్న రెండేళ్ల పాపను బలవంతంగా తీసుకెళ్లిన ఐస్ ఏజెంట్లు
  • కోర్టు ఆదేశాలు ఉన్నా టెక్సాస్‌కు తరలింపు
  • వారెంట్ లేకుండా తండ్రి కారు అద్దాలు పగలగొట్టి పాపను తీసుకెళ్లారని ఆరోపణ
  • తండ్రిని అరెస్ట్ చేసే సమయంలో తల్లి పాపను తీసుకోవడానికి నిరాకరించిందన్న డీహెచ్ఎస్
  • అందుకే చిన్నారిని సంరక్షణలోకి తీసుకున్నామని వెల్లడి
అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేతకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన చర్యలు ఇప్పుడు పసి పిల్లల వరకు చేరాయి. మినియాపాలిస్‌లో తన తండ్రితో కలిసి కిరాణా దుకాణం నుంచి తిరిగి వస్తున్న రెండేళ్ల చిన్నారి క్లోయ్ రెనాటాను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) ఏజెంట్లు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. కోర్టు ఆ చిన్నారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించినప్పటికీ, అధికారులు ఆమెను తండ్రితోపాటు విమానంలో టెక్సాస్‌లోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.

ఈ ఘటనపై మిన్నియాపాలిస్ సిటీ కౌన్సిల్ సభ్యుడు జేసన్ చావెజ్ తీవ్రంగా స్పందించారు. అధికారుల తీరును కిడ్నాప్‌తో పోల్చారు. ఎటువంటి జుడీషియల్ వారెంట్ లేకుండానే తండ్రి కారు విండో పగలగొట్టి వారిని బలవంతంగా తీసుకెళ్లారని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆరోపించారు. అయితే, ప్రభుత్వం ఈ వాదనను తోసిపుచ్చింది. తండ్రి ఎల్విస్ జోయెల్ అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన నిందితుడని, అరెస్ట్ సమయంలో అతడు సహకరించలేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (DHS) పేర్కొంది.

ఈ రెండేళ్ల పాపే కాదు, గత కొన్ని వారాల్లోనే ఐదుగురు చిన్న పిల్లలను ఐసీఈ అదుపులోకి తీసుకోవడం గమనార్హం. గత మంగళవారం, ఐదేళ్ల లియామ్ కొనెజో అనే బాలుడిని కూడా తన తండ్రితో కలిపి అదుపులోకి తీసుకున్నారు. తండ్రిని పట్టుకునేందుకు చిన్నారిని అధికారులు 'ఎర'గా వాడుకున్నారని పాఠశాల అధికారులు ఆరోపించడం సంచలనంగా మారింది.

ప్రస్తుతం అమెరికాలో 'ఆపరేషన్ మెట్రో సర్జ్' పేరుతో అతిపెద్ద ఫెడరల్ ఆపరేషన్ కొనసాగుతోంది. దీని కోసం వారానికి సుమారు రూ. 150 కోట్లు (18 మిలియన్ డాలర్లు) ఖర్చు చేస్తున్నారు. సుమారు 3,000 మంది ఏజెంట్లతో ముఖ్యంగా మిన్నెసోటా పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఈ చర్యలను చట్టబద్ధమని సమర్థించుకుంటున్నా, మానవ హక్కుల సంఘాలు, స్థానిక నాయకులు మాత్రం ట్రంప్ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Chloe Renata
ICE
Immigration and Customs Enforcement
Minneapolis
Operation Metro Surge
Donald Trump
Immigration
US Immigration
Detention Center
Elvis Joel

More Telugu News