Afghanistan: మంచు తుపానుతో ఆఫ్ఘనిస్థాన్ అతలాకుతలం

Afghanistan Devastated by Snowstorm and Floods
  • భారీ వర్షాల కారణంగా దాదాపు 61 మంది మృతిచెందగా, 110 మందికి పైగా గాయపడ్డారన్న విపత్తు నిర్వహణ శాఖ 
  • మధ్య, తూర్పు ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతాల్లో తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉందన్న వాతావరణ శాఖ అధికారులు
  • భారీ వర్షాలు, మంచు కారణంగా ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు చేరుకున్న వైనం
ఆఫ్ఘనిస్థాన్‌లో మంచు తుపాను, భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, మంచు కురుస్తుండటంతో ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దాదాపు 61 మంది మృతి చెందగా, 110 మందికి పైగా గాయపడినట్లు అక్కడి విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు.

మధ్య, తూర్పు ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతాల్లో తుపాను తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాలు, మంచు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకోవడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలిపింది. కాందహార్ ప్రావిన్సులో భారీ వర్షాల కారణంగా ఒక ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

తుపాను ప్రభావంతో ఆఫ్ఘనిస్థాన్ ప్రధాన రహదారి అయిన సలాంగ్ జాతీయ రహదారి తీవ్రంగా దెబ్బతినడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. అలాగే ఉజ్బెకిస్థాన్ నుంచి ఆఫ్ఘనిస్థాన్‌కు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌మిషన్ లైన్ దెబ్బతినడంతో 12 ప్రావిన్సుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులు ధ్వంసం కావడంతో సాంకేతిక సిబ్బంది సకాలంలో సంఘటన స్థలాలకు చేరుకోలేకపోతున్నారని అధికారులు పేర్కొన్నారు.

అకాల వర్షాల కారణంగా పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లిందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌లో నాలుగు కోట్ల మందికి పైగా ప్రజలు మానవతా సహాయంపై ఆధారపడుతున్నారని యునైటెడ్ స్టేట్స్ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో, తాజా వరదలు దేశాన్ని మరింత పేదరికంలోకి నెట్టాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
Afghanistan
Afghanistan snowstorm
Afghanistan floods
Kandahar
Salang Pass
Natural disaster
Heavy rainfall
Weather
Humanitarian crisis
United States

More Telugu News