రంజీ ట్రోఫీ... క్వార్టర్ ఫైనల్స్ దిశగా దూసుకెళుతున్న ఆంధ్రా జట్టు

  • విదర్భతో మ్యాచ్‌లో పట్టు బిగించిన ఆంధ్ర జట్టు
  • గెలుపుకు 166 పరుగుల దూరంలో నిలిచిన ఆంధ్ర
  • అర్ధశతకంతో ఆకట్టుకున్న యువ బ్యాటర్ షేక్ రషీద్
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో ఆంధ్ర జట్టు క్వార్టర్ ఫైనల్స్ దిశగా మరో కీలక అడుగు వేసింది. అనంతపురంలో విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో నిలిచింది. 259 పరుగుల లక్ష్య ఛేదనలో ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 93 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 166 పరుగులు అవసరం కాగా, 9 వికెట్లు చేతిలో ఉన్నాయి.

యువ బ్యాటర్ షేక్ రషీద్ (50*) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా, వికెట్ కీపర్ కేఎస్ భరత్ (27*) అతనికి చక్కటి సహకారం అందిస్తున్నాడు. వీరిద్దరూ అభేద్యమైన రెండో వికెట్‌కు 78 పరుగులు జోడించి క్రీజులో నిలిచారు. చివరి రోజు వీరిద్దరూ నిలకడగా ఆడితే ఆంధ్ర విజయం లాంఛనమే కానుంది.

అంతకుముందు, ఆంధ్ర బౌలర్లు విజృంభించడంతో విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలింది. యశ్ రాథోడ్ (56) ఒక్కడే రాణించాడు. ఆంధ్ర బౌలర్లలో కె. సాయితేజ 4 వికెట్లతో చెలరేగగా, నితీశ్ కుమార్ రెడ్డి, సౌరభ్ కుమార్, త్రిపురాన విజయ్ కీలక వికెట్లు పడగొట్టారు.

మరోవైపు, భువనేశ్వర్‌లో ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు విజయం దిశగా సాగుతోంది. ఓపెనర్ ఎస్.ఆర్. అతీశ్ (88), సోను యాదవ్ (74) రాణించడంతో ఒడిశా ముందు 455 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆట ముగిసే సమయానికి ఒడిశా 47/2 స్కోరుతో ఎదురీదుతోంది. లక్నోలో జరుగుతున్న మరో మ్యాచ్‌లో, ఝార్ఖండ్ చేతిలో ఉత్తరప్రదేశ్ ఘోర పరాజయం పాలవడం ఖాయంగా కనిపిస్తోంది.


More Telugu News