KTR: మున్సిపల్ ఎన్నికలు.. ఇన్‌ఛార్జ్‌లను నియమించిన కేటీఆర్

KTR Appoints Incharges for Municipal Elections
  • కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా సమన్వయకర్తల జాబితా విడుదల
  • మున్సిపాలిటీ, కార్పొరేషన్ బాధ్యతలు సీనియర్ నాయకుడికి అప్పగింత
  • అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఇన్‌ఛార్జ్‌లది కీలక పాత్ర అన్న కేటీఆర్
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఈ మేరకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా సమన్వయకర్తల జాబితాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ బాధ్యతలను ఒక సీనియర్ నాయకుడికి అప్పగించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు వీరు నిరంతరం స్థానిక నాయకత్వానికి, కేడర్‌కు అందుబాటులో ఉంటారని కేటీఆర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలను రూపొందించడం ఇన్‌ఛార్జ్‌ల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఇన్‌ఛార్జ్‌లది కీలక పాత్ర అని ఆయన తెలిపారు. స్థానిక నాయకత్వంతో చర్చించి, అందరినీ సమన్వయపరిచి గెలుపు గుర్రాలకు సంబంధించిన నివేదికను పార్టీ అధిష్ఠానానికి వారు సమర్పిస్తారని అన్నారు. పార్టీ ప్రచార కార్యక్రమాలను ఇన్‌ఛార్జ్‌లు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లాలని సూచించారు.

ఎన్నికల సరళి, క్షేత్రస్థాయి పరిశీలన, కార్పొరేషన్, మున్సిపాలిటీలలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
KTR
BRS Party
Telangana Municipal Elections
Municipal Elections 2024
Telangana Politics
BRS Leaders

More Telugu News