చంద్రబాబు నగరి పర్యటనపై రోజా విమర్శలు
- నగరిలో చంద్రబాబు డబ్బా కొట్టుకున్నారన్న రోజా
- ఇక్కడ అభివృద్ధి పనులన్నీ వైసీపీ హయాంలోనే జరిగాయని వ్యాఖ్య
- చంద్రబాబు అబద్ధాలు వినలేక ప్రజలు దూరంగా ఉన్నారని ఎద్దేవా
నగరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పనితీరు పూర్తిగా శూన్యమని మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నగరిలో పర్యటించిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
నగరిలో కల్యాణమండపం, సబ్‌స్టేషన్, పాలిటెక్నిక్ కళాశాల, పార్కు, షాదీ మహల్ వంటి అభివృద్ధి పనులన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని రోజా తెలిపారు. పేదలకు ఇళ్ల మంజూరు సహా అనేక సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వమే అందించిందని చెప్పారు.
‘‘నగరిలో సీఎం చంద్రబాబు డబ్బా కొట్టుకోవడం తప్ప నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర, అరాచక ఆంధ్రగా మార్చేశారు’’ అంటూ రోజా మండిపడ్డారు. చంద్రబాబు నాలుగుసార్లు సీఎం అయినా నగరికి ఏమీ చేయలేదని, గాలి ముద్దుకృష్ణమ నాయుడు చేసిన అభివృద్ధి కూడా శూన్యమేనని విమర్శించారు.
వైసీపీ పాలనలో వందల కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు తదితర అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. పవర్‌లూమ్ కార్మికులకు జగన్ ఇచ్చిన సహాయాన్ని మించి, ఇంకెవరూ అంత సహాయం అందించలేదని అన్నారు. ఉచిత కరెంట్ ఇస్తామని జీవో ఇచ్చి చంద్రబాబు కార్మికులను మోసం చేశారని ఆరోపించారు. టెక్స్‌టైల్ పార్క్ విషయంలో కూడా మాట తప్పారని అన్నారు.
నగరి ఆసుపత్రి పర్యటనకు సీఎం వెళ్లకపోవడం వెనుక అది జగన్ హయాంలో నిర్మించిందేనన్న భయమే కారణమని రోజా వ్యాఖ్యానించారు. ఏ అభివృద్ధి చేయని ఎమ్మెల్యే భాను ప్రకాశ్ ను కూడా బాగా పనిచేశారని పొగడడం విడ్డూరమని అన్నారు. చెరుకు రైతులు, మామిడి రైతులను చంద్రబాబు సర్వనాశనం చేశారని ఆరోపిస్తూ... నగరి ప్రజలు సీఎం అబద్ధాలు వినలేకనే దూరంగా ఉన్నారని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.