Sake Sailajanath: రెడ్ బుక్ లో జనసేన నేతల పేర్లు కూడా ఉన్నాయి: శైలజానాథ్

Sake Sailajanath Janasena Leaders Names Also in Red Book
  • రెడ్‌బుక్ అరాచకాల వల్లే ఏపీకి పెట్టుబడులు రాలేదన్న శైలజానాథ్
  • దావోస్ వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని ఎద్దేవా
  • పోలీసు శాఖ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని విమర్శ

రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచకాల వల్లే ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రావడం లేదని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తీవ్ర విమర్శలు చేశారు. రెడ్‌బుక్‌లో జనసేన నేతల పేర్లు కూడా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఎల్లో మీడియా సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ లకు భజన చేస్తోందంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అబద్ధాలను ప్రజలు ఇప్పుడు స్పష్టంగా గుర్తిస్తున్నారని ఆయన అన్నారు.


తాజాగా మీడియాతో మాట్లాడిన సాకే శైలజానాథ్… సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపై తీవ్రంగా స్పందించారు. దావోస్ వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని, అప్పు చేసి పప్పుకూడు తిన్నట్లుగా చంద్రబాబు పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. స్పెషల్ ఫ్లైట్లలో వెళ్లి రావడం తప్ప దావోస్ పర్యటనలో చంద్రబాబు సాధించింది ఏమీ లేదని విమర్శించారు. ట్రంప్‌తో ఫోటో దిగేందుకు చంద్రబాబు ప్రయత్నించారని, ప్రజలను మభ్యపెట్టేందుకు మరోసారి డబ్బా కొట్టేందుకు సిద్ధమవుతున్నారని ఎద్దేవా చేశారు. అందరినీ ట్రంప్ భయపెడితే, చంద్రబాబుతో ఫొటో దిగేందుకు మాత్రం ట్రంప్ భయపడ్డారట అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.


ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను రెడ్‌బుక్ ద్వారా పూర్తిగా నాశనం చేశారని సాకే శైలజానాథ్ ఆరోపించారు. రెడ్‌బుక్ అరాచకాల కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని స్పష్టం చేశారు. దావోస్ నుంచి జీరోలుగా తిరిగి వచ్చామని చంద్రబాబు, లోకేశ్ బహిరంగంగా అంగీకరించాలని డిమాండ్ చేశారు. 


రాష్ట్రంలో చంద్రబాబు ఎమర్జెన్సీ తరహా పాలన కొనసాగిస్తున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులకు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు చెప్పడం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు.


వైసీపీ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెట్టాయని పేర్కొన్న సాకే శైలజానాథ్, చంద్రబాబుకు అసలు బ్రాండ్ అనేదే లేదన్నారు. సోషల్ మీడియాలో లైక్ లేదా కామెంట్ చేసినా ప్రభుత్వం సహించలేకపోతోందని విమర్శించారు. కూటమి పాలనలో పోలీసు శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Sake Sailajanath
Andhra Pradesh
Red Book
Chandrababu Naidu
Nara Lokesh
Janaseena
AP Investments
Davos
YS Jagan
AP Politics

More Telugu News