Nampally: నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

Nampally Furniture Shop Fire Accident in Hyderabad
  • గ్రౌండ్‌ఫ్లోర్ నుంచి నాలుగో అంతస్తుకు వ్యాపించిన మంటలు
  • రోబో ఫైర్ మిషన్ ద్వారా మంటలు ఆర్పుతున్న సిబ్బంది
  • ఎనిమిది ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్న సిబ్బంది
నాంపల్లిలోని ఓ ఫర్నీచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బచ్చా క్యాజిల్ ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగి నాలుగో అంతస్తు వరకు వ్యాపించాయి. ప్రమాదం మొదట గ్రౌండ్ ఫ్లోర్‌లో సంభవించి, ఆపై నాలుగు అంతస్తులకు విస్తరించింది. రోబో ఫైర్ మిషన్ ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఘటనా స్థలానికి భారీ క్రేన్లు చేరుకున్నాయి. భవనం లోపల ఇద్దరు చిన్నారులు, నలుగురు పెద్దలు చిక్కుకున్నట్లు సిబ్బంది గుర్తించారు. స్కైలాడర్ ద్వారా నాలుగో అంతస్తు అద్దాలను పగులగొట్టి వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవనం పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

ఫర్నిచర్ దుకాణంలోని సెల్లార్‌లో ఫర్నిచర్ నిల్వ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎనిమిది ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాద ప్రాంతంలో పోలీసులు, హైడ్రా సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. ప్రమాద తీవ్రతను పెంచే వస్తువులను అక్కడి నుంచి తరలించారు.
Nampally
Nampally fire accident
Hyderabad fire accident
Bachha Castle Furniture
Furniture shop fire

More Telugu News