Srinivas Varma: సినీ గ్లామర్ తో రాజకీయాల్లో విజయం సాధించడం సాధ్యం కాదు: కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ

Srinivas Varma Says Movie Glamour Alone Cannot Guarantee Political Success
  • ఎన్టీఆర్ తర్వాత సినీ ఇమేజ్ మీదే నిలదొక్కుకున్న ఉదాహరణలు లేవన్న వర్మ
  • సమస్యలపై పోరాటమే రాజకీయాల్లో అసలైన బలం అని వ్యాఖ్య
  • పవన్ బలమైన ప్రజా నాయకుడిగా ఎదిగారని వ్యాఖ్య

సినిమా గ్లామర్ ఒక్కటే ఆధారంగా పెట్టుకుని రాజకీయాల్లో దీర్ఘకాల విజయం సాధించడం సాధ్యం కాదని కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్టీఆర్ తర్వాత కేవలం సినీ ఇమేజ్ మీదే రాజకీయాల్లో నిలదొక్కుకున్న ఉదాహరణలు లేవని స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమయ్యే నాయకత్వం, వారి సమస్యలపై పోరాటమే రాజకీయాల్లో అసలైన బలం అని ఆయన అభిప్రాయపడ్డారు.


అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మాత్రం భిన్నంగా చూడాలన్నారు. పవన్ కల్యాణ్ కేవలం సినీ నటుడిగానే కాకుండా, ప్రజల మధ్య ఉండే బలమైన ప్రజా నాయకుడిగా ఎదిగారని శ్రీనివాస్ వర్మ ప్రశంసించారు. ప్రజా సమస్యలపై నేరుగా పోరాడటం, ప్రజలతో సన్నిహితంగా మెలగడం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు. అలాగే, కూటమిగా కలిసి ఎన్నికలకు వెళ్లడం వల్లే ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధ్యమైందని ఆయన గుర్తుచేశారు.


ఇక జాతీయ రాజకీయాల విషయానికి వస్తే, ప్రస్తుతం దేశంలో సినీ స్టార్లను మించిన స్టార్ ప్రధాని నరేంద్ర మోదీ అని శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలోనే బీజేపీ దేశవ్యాప్తంగా బలపడుతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ పొత్తుల విషయంలో అగ్రనాయకత్వమే చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.


మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై కూడా ఆయన స్పందించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం సమీక్షలు నిర్వహిస్తోందని తెలిపారు. ఆర్థిక భారం తగ్గించే క్రమంలోనే సీఐఎస్ఎఫ్ బలగాల ఉపసంహరణ జరిగిందని వివరణ ఇచ్చారు. ఫిబ్రవరి 4న ఉక్కు శాఖ కార్యదర్శి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు.



Srinivas Varma
Srinivas Varma comments
Pawan Kalyan
Visakha Steel Plant
Narendra Modi
BJP
Telugu cinema
Andhra Pradesh politics
Janasena
political alliances

More Telugu News