Asif Nazrul: టీ20 ప్రపంచకప్‌పై వివాదం.. లైవ్‌లోనే నోరు జారిన బంగ్లాదేశ్ అధికారి!

Bangladesh Sports Advisor Goes On T20 World Cup Exclusion Rant On Live TV After Clash With ICC
  • టోర్నీ నుంచి బంగ్లా దాదాపు వైదొలగిందన్న క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్
  • భారత్‌లో కాకుండా శ్రీలంకలో మ్యాచ్‌లు నిర్వహించాలని డిమాండ్
  • వేదిక మార్పు అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ
  • ప్రభుత్వ స్థాయిలోనూ వైదొలగాలనే నిర్ణయం తీసుకున్నట్టు సంకేతాలు
భారత్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనే విషయంపై నెలకొన్న ఉత్కంఠకు దాదాపు తెరపడినట్టే కనిపిస్తోంది. ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ దాదాపుగా వైదొలగిందని ఆ దేశ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారం ఇప్పుడు కేవలం క్రీడాపరమైన అంశంగా కాకుండా, దేశాల మధ్య సమస్యగా మారుతోంది.

ఢాకాలో జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నజ్రుల్ మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేడియంలోని అభిమానుల ఉత్సాహాన్ని చూసి, "బంగ్లాదేశ్ ప్రజలు క్రికెట్‌ను ఎంతగా ప్రేమిస్తారో ఇక్కడ కనిపిస్తోంది. ఇది ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి దాదాపు బయటకు వచ్చేసింది" అని పరోక్షంగా స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రత్యక్ష ప్రసారం కావడంతో టోర్నీ నుంచి వైదొలగాలనే నిర్ణయాన్ని ప్రభుత్వ వర్గాలు కూడా అంగీకరించాయనే సంకేతాలు వెలువడ్డాయి.

భారత్‌లో తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళనలు ఉన్నాయని, అందుకే జట్టును పంపబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ముందునుంచీ చెబుతోంది. బంగ్లాదేశ్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలన్న వారి అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. షెడ్యూల్ ప్రకారమే టోర్నీ జరుగుతుందని, మార్పులు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. దీంతో బీసీబీ, ఐసీసీ మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది.

ఈ నేపథ్యంలో నజ్రుల్ మాట్లాడుతూ.. "ఆడే హక్కు వారికి (ఆటగాళ్లకు) ఉంది. కానీ, పరిస్థితుల వల్ల వారు టోర్నీకి దూరమయ్యే పరిస్థితి వస్తోంది" అని అన్నారు. బీపీఎల్ ఫైనల్‌కు పలువురు ప్రభుత్వ సలహాదారులు హాజరుకావడాన్ని ప్రస్తావిస్తూ, ఇది కేవలం ఆట విషయం కాదని, దేశ స్థాయి నిర్ణయంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐసీసీ మెట్టు దిగకపోవడం, బీసీబీ వెనక్కి తగ్గకపోవడంతో బంగ్లాదేశ్ వరల్డ్ కప్‌కు దూరమవడం ఖాయంగా కనిపిస్తోంది.
Asif Nazrul
Bangladesh
T20 World Cup
BPL
Bangladesh Premier League
ICC
BCB
Cricket
Sports
India

More Telugu News