Gali Janardhan Reddy: బళ్లారిలో టెన్షన్.. గాలి జనార్దన్ రెడ్డి భవనానికి నిప్పు

Gali Janardhan Reddy House Set on Fire in Ballari
  • బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఇంటికి నిప్పుపెట్టిన దుండ‌గులు
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్గీయుల పనేనని సోదరుడి ఆరోపణ
  • ఇటీవల ఇరు వర్గాల మధ్య కాల్పుల ఘటన నేపథ్యంలో కలకలం
  • ఘటనపై కేసు నమోదు.. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కర్ణాటక రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓ భవనాన్ని దుండగులు దగ్ధం చేశారు. బళ్లారి కంటోన్మెంట్ ప్రాంతంలో నిన్న‌ సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. 

ఈ ఘటన వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారులు ఉన్నారని గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి ఆరోపించారు. భవనంపై పెట్రోల్, డీజిల్ పోసి ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ నెల‌ 1న గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద భరత్ రెడ్డి వర్గీయులు కాల్పులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వివాదం సద్దుమణగక ముందే ఇప్పుడు ఈ అగ్నిప్రమాదం జరగడం గమనార్హం.

బళ్లారి నగరంలోని 'జీ స్క్వేర్ లేఅవుట్'లో ఉన్న ఈ 'మోడల్ హౌస్' విలువ సుమారు రూ. 3 కోట్లు ఉంటుందని అంచనా. 13 ఏళ్ల క్రితం కొనుగోలుదారులను ఆకర్షించేందుకు దీనిని నిర్మించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల కోసం గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ, ఇటీవల బ్యానర్ల గొడవ తర్వాత ఈ ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. బళ్లారి ఎస్పీతో మాట్లాడానని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ ఘటనతో బళ్లారిలో ఇరువర్గాల మధ్య రాజకీయ వైరం మరింత ముదిరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Gali Janardhan Reddy
Gali Janardhan Reddy house fire
Ballari
Nara Bharath Reddy
Karnataka politics
Gali Somasekhara Reddy
BJP MLA
Congress MLA

More Telugu News