RTO: షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్.. తెలంగాణలో నేటి నుంచి కొత్త విధానం అమలు

Telangana Transport Department New Vehicle Registration Policy Implemented
  • వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి
  • ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదు
  • ద్విచక్ర వాహనాలు, కార్లకు మాత్రమే ఈ కొత్త విధానం వర్తింపు
  • రవాణా వాహనాల రిజిస్ట్రేషన్‌లు పాత పద్ధతిలోనే కొనసాగింపు
తెలంగాణలో వాహన కొనుగోలుదారులకు ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పనున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇకపై వాహనం కొనుగోలు చేసిన డీలర్ పాయింట్ వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తిచేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా సమయం ఆదా అవడంతో పాటు వాహనదారులకు వేగంగా సేవలు అందనున్నాయి.

వాహనదారులకు సౌలభ్యం కల్పించే ఉద్దేశంతో ఈ నెల 8న రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మాదాపూర్ శ్రీకృష్ణ ఆటోమోటివ్స్ షోరూమ్‌లో ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో సంయుక్త రవాణా కమిషనర్ (జేటీసీ) మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ స్వయంగా వాహనదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు.

కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ ఇలా..
నూతన విధానం ప్రకారం, వాహనం కొనుగోలు చేసిన తర్వాత డీలరే రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారు. ఇన్వాయిస్, ఫారం-21, ఫారం-22, ఇన్సూరెన్స్, అడ్రస్ ప్రూఫ్, వాహన ఫొటోలు వంటి అవసరమైన పత్రాలన్నింటినీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. రవాణా శాఖ అధికారి ఆ దరఖాస్తును ఆన్‌లైన్‌లోనే పరిశీలించి, వెంటనే రిజిస్ట్రేషన్ నంబరు కేటాయిస్తారు. ఉదయం వాహనం కొంటే సాయంత్రంలోగా, సాయంత్రం కొంటే మరుసటి రోజు ఉదయంలోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ) నేరుగా స్పీడ్ పోస్టు ద్వారా వాహన యజమాని చిరునామాకు చేరుతుంది.

వీటికి మాత్రమే వర్తింపు..
అయితే, ఈ కొత్త విధానం కేవలం ప్రైవేట్ వాహనాలైన బైక్‌లు, కార్లకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. వాణిజ్య (ట్రాన్స్‌పోర్ట్) వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ యథావిధిగా ఆర్టీఓ కార్యాలయాల్లోనే కొనసాగుతుంది. ఈ విధానం అమలులో పారదర్శకత కోసం అవసరమైతే డీలర్ల షోరూమ్‌లలో తనిఖీలు నిర్వహిస్తామని రవాణా శాఖ తెలిపింది. ఈ నూతన విధానంపై రాష్ట్రంలోని 33 జిల్లాల అధికారులకు రవాణా శాఖ కమిషనర్ ఆన్‌లైన్ సమావేశం ద్వారా పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. 
RTO
Telangana Transport Department
Vehicle Registration
Telangana
Vehicle Registration Process
New Vehicle Policy
Transport Department
Mamindla Chandrasekhar Goud
Vehicle Owners

More Telugu News