America: మంచు తుపాన్ ఎఫెక్ట్.. అమెరికాలో ఖాళీ అవుతున్న సూపర్ మార్కెట్లు

Winter Storm Empties US Supermarkets
  • 2,700 విమానాలను రద్దు చేసిన ఎయిర్ లైన్స్ సంస్థలు
  • టెక్సాస్, న్యూయార్క్, షికాగో సహా 16 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
  • మంచుతో పాటు ఇబ్బంది పెట్టనున్న చలిగాలులు
అమెరికాను మంచు తుపాన్ వణికిస్తోంది. శుక్రవారం సాయంత్రం నుంచి మంగళవారం వరకు తుపాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీగా మంచు కురవడంతో పాటు, విపరీతమైన చలి గాలులు వీస్తాయని, కొన్నిచోట్ల వర్షం పడుతుందని పేర్కొంది. టెక్సాస్, న్యూయార్క్, షికాగో సహా మొత్తం 16 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. మంచు తుపాన్ ప్రభావంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉండడంతో జనం తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

తుపాన్ ప్రభావంతో సూపర్ మార్కెట్లు, గ్రోసరీ స్టోర్లకు జనం పోటెత్తారు. నాలుగైదు రోజులు బయట అడుగుపెట్టే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఆహార పదార్థాలు, వాటర్ క్యాన్లు కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో సూపర్ మార్కెట్లు ఖాళీ అయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోనంత వరకూ తాము క్షేమంగానే ఉంటామని ప్రజలు చెబుతున్నారు.

కాగా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నార్తరన్ ప్లెయిన్స్ లో తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, పలు రాష్ట్రాల్లో మైనస్ 46.6 సెల్సియస్ ల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నార్త్, సౌత్ డకోటా రాష్ట్రాలతో పాటు నెబ్రస్కా, ఈస్ట్రన్ మోంటానా, వ్యోమింగ్, మిన్నెసోటా, లోవా తదితర రాష్ట్రాల్లో జనం బయట అడుగుపెట్టొద్దని అధికారులు సూచించారు.

ఎయిర్ లైన్స్ పై మంచు తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఇప్పటికే 2,700 విమానాలను ఎయిర్ లైన్స్ సంస్థలు రద్దు చేశాయి. టెక్సాస్ రాష్ట్రంలోని వివిధ నగరాలకు రావాల్సిన, అక్కడి నుంచి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
America
Winter storm
US storm
Supermarkets
Texas
New York
Chicago
Weather forecast
Emergency declaration

More Telugu News