Vijay Kumar: అమెరికాలో దారుణం: భార్య సహా నలుగురిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి

Indian American Vijay Kumar Arrested in Georgia Family Homicide
  • భార్య, ముగ్గురు బంధువులను కాల్చి చంపిన విజయ్ కుమార్ 
  • కుటుంబ కలహాలే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
  • క్లోజెట్‌లో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్న ముగ్గురు చిన్నారులు
అమెరికాలోని జార్జియాలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా తన భార్య సహా నలుగురిని కాల్చి చంపాడు. గ్విన్నెట్ కౌంటీలోని లారెన్స్‌విల్లే ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ విషాదం జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి హత్య కేసులు నమోదు చేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అట్లాంటాకు చెందిన విజయ్ కుమార్ (51) ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మృతులను అతని భార్య మీమూ డోగ్రా (43), బంధువులైన గౌరవ్ కుమార్ (33), నిధి చందర్ (37), హరీష్ చందర్ (38)గా గుర్తించారు. ఈ ఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల్లో ఒకరు భారత జాతీయుడు ఉన్నారని, బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందిస్తామని 'X' వేదికగా ప్రకటించింది.

ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. కాల్పుల శబ్దం విన్న వారు భయంతో ఓ క్లోజెట్‌లో దాక్కున్నారు. వారిలో ఓ చిన్నారి సమయస్ఫూర్తితో 911కు ఫోన్ చేసి సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పిల్లలు ముగ్గురూ సురక్షితంగా ఉన్నారని, వారిని బంధువులకు అప్పగించామని అధికారులు తెలిపారు.

అట్లాంటాలోని ఇంట్లో విజయ్ కుమార్‌కు, అతని భార్యకు మధ్య వాగ్వాదం మొదలైనట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అనంతరం వారు తమ 12 ఏళ్ల కుమారుడితో కలిసి లారెన్స్‌విల్లేలోని బంధువుల ఇంటికి వెళ్లగా, అక్కడ ఈ దారుణం జరిగింది. నిందితుడు విజయ్ కుమార్‌పై నాలుగు హత్య కేసులు, చిన్నారుల పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Vijay Kumar
Georgia shooting
Indian American
Lawrenceville
Gwinnett County
Atlanta
family dispute
homicide
crime news
India consulate

More Telugu News