Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో అరాచక పాలన.. యూనస్ ప్రభుత్వంపై హసీనా ఫైర్

Sheikh Hasina Fires at Yunus Government Over Anarchy in Bangladesh
  • బంగ్లాను యూనస్ ప్రభుత్వం అరాచకంలోకి నెట్టిందన్న హసీనా
  • ఢిల్లీలో రికార్డెడ్ ఆడియో సందేశం ద్వారా తీవ్ర విమర్శలు
  • దేశం ఓ మృత్యులోయగా మారిందని ఆవేదన
  • యూనస్ ప్రభుత్వాన్ని తొలగించాలని, యూఎన్ విచారణ జరపాలని డిమాండ్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను 'హంతక అరాచకం', 'భయోత్పాత యుగం'లోకి నెట్టివేసిందని ఆమె ఆరోపించారు. భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న ఆమె, న్యూఢిల్లీలోని ఫారెన్ కరస్పాండెంట్స్ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముందుగా రికార్డు చేసిన 10 నిమిషాల ఆడియో సందేశం ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న మా భూమి ఇప్పుడు గాయపడిన, రక్తసిక్తమైన ప్రదేశంగా మారింది. దేశం మొత్తం ఒక విశాలమైన జైలుగా, మరణశిక్షల క్షేత్రంగా, మృత్యులోయగా తయారైంది" అని హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. యూనస్ ప్రభుత్వాన్ని 'అక్రమ, హింసాత్మక' యంత్రాంగంగా, 'విదేశీ తొత్తు ప్రభుత్వం'గా ఆమె అభివర్ణించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఖైదులో ఉందని, తనను ఓ కుట్ర ప్రకారం గద్దె దించారని ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆమె ఐదు డిమాండ్లు చేశారు. యూనస్ ప్రభుత్వాన్ని వెంటనే తొలగించాలని, గత ఏడాది జరిగిన ఘటనలపై ఐక్యరాజ్యసమితితో నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరారు. విమోచన యుద్ధ స్ఫూర్తితో దేశ ప్రజలంతా ఏకమై ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు.

గతేడాది ఆగస్టు 5న విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోగా, ఆమె భారత్‌కు వలస వెళ్లిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12న పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా, ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించారు. హసీనాతో పాటు పలువురిపై దేశద్రోహం కేసు కూడా నమోదైంది.
Sheikh Hasina
Bangladesh
Mohammad Yunus
Bangladesh Awami League
Bangladesh election
political unrest
foreign correspondents club
parliament election
exile
democracy

More Telugu News