Jogi Ramesh: జైలు నుంచి విడుదలైన వైసీపీ నేత జోగి రమేశ్

Jogi Ramesh Released From Jail In Fake Liquor Case
  • ములకలపల్లి కల్తీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు
  • తమపై అక్రమ కేసులు బనాయించి రాజకీయంగా వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న జోగి రమేశ్ 
  • సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడి
నకిలీ మద్యం కేసులో గత కొంతకాలంగా అండర్ ట్రయల్ ఖైదీలుగా జైలులో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు రాము విడుదలయ్యారు. ములకలచెరువు కల్తీ మద్యం కేసులో వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు రోజుల క్రితమే ఇబ్రహీంపట్నం కేసులోనూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా రెండో కేసులో కూడా బెయిల్ మంజూరు కావడంతో జోగి సోదరులు శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు.

ఈ సందర్భంగా జోగి రమేశ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమపై అక్రమ కేసులు బనాయించి రాజకీయంగా వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. 83 రోజుల పాటు తనను, తన సోదరుడిని జైలులో ఉంచి నరకం చూపించారని, ఉద్దేశపూర్వకంగానే వివిధ జైళ్లకు తిప్పుతూ మానసికంగా కుంగదీయాలని చూశారని ఆయన వాపోయారు.

తాను ఏ తప్పూ చేయలేదని, నిజానిజాలు తేలాలంటే తనకు నార్కో అనాలసిస్ లేదా లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉందని, అందుకే దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ తాను ఇదివరకే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. తాను గతంలోనే సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి సిద్ధమన్నారు.

‘నేను ఏ తప్పూ చేయలేదని బెజవాడ దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తాను. శనివారం అమ్మవారి ఆలయానికి వెళ్లి నా నిజాయితీని చాటుకుంటాను. చర్చకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కోరుతున్నాను’ అని పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా వైసీపీ నేతలు భయపడరని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. 
Jogi Ramesh
YSRCP
fake liquor case
bail granted
Andhra Pradesh politics
Chandrababu Naidu
jail release
narcotics test
CBI investigation
YSR Jagan Mohan Reddy

More Telugu News