India vs New Zealand: రెండో టీ20లో టీమిండియా సూపర్ విక్టరీ... కివీస్ బౌలర్లను ఉతికారేశారు!

India Thrash New Zealand in Second T20
  • న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం
  • 209 పరుగుల భారీ లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా
  • విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన ఇషాన్ కిషన్ (76), సూర్యకుమార్ (82*)
  • ఈ విజయంతో టీ20 సిరీస్‌ లో టీమిండియా 2-0తో ఆధిక్యం
  • తొలుత కివీస్ 208 పరుగులు.. కెప్టెన్ శాంట్నర్ మెరుపు ఇన్నింగ్స్
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ పోరులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (82*), వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (76) సృష్టించిన విధ్వంసానికి కివీస్ బౌలర్లు చేతులెత్తేశారు. ప్రత్యర్థి నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 15.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

అనంతరం 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సంజూ శాంసన్ (6), అభిషేక్ శర్మ (0) కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ తనదైన శైలిలో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 32 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 122 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి భారత విజయాన్ని ఖాయం చేశారు.

ఇషాన్ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే (18 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సులు) కూడా దూకుడుగా ఆడటంతో భారత్ మరో 28 బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా విజయాన్ని అందుకుంది. చివరి వరకు క్రీజులో నిలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫ్ఫీ, ఇష్ సోధీ తలో వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. కివీస్ ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర (26 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్సులు) టాప్ స్కోరర్‌గా నిలవగా, ఆఖర్లో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (27 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 35 పరుగులిచ్చి 2 వికెట్లతో రాణించగా, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు.

ఇక ఇరుజట్ల మధ్య మూడో టీ20 ఈ నెల 25న గువాహటిలో జరగనుంది.
India vs New Zealand
India
Suryakumar Yadav
Suryakumar Yadav batting
Ishan Kishan
India win
T20 series
cricket
Shahid Veer Narayan Singh International Stadium
rachin ravindra
Kuldeep Yadav

More Telugu News