Sheikh Hasina: అరాచకం... బంగ్లాదేశ్‌లోని పరిస్థితిపై షేక్ హసీనా తీవ్ర ఆందోళన

Sheikh Hasina Expresses Concern Over Anarchy in Bangladesh
  • దేశంలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయన్న షేక్ హసీనా
  • ఒకప్పుడు శాంతియుత బంగ్లాదేశ్, ఇప్పుడు హింస, భయం, విధ్వంసాన్ని ఎదుర్కొంటోందని వ్యాఖ్య
  • హింసాత్మక పాలనకు ముగింపు పలకడానికి పోరాటం చేయాలని పిలుపు
బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ దేశాన్ని అరాచకంలోకి నెట్టివేస్తున్నారని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ప్రజాస్వామ్యం ఇప్పుడు రక్తంతో తడిసి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం చీకటి రోజుల్లో ఉందని ఆమె అన్నారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఒకప్పుడు శాంతియుత దేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు తీవ్రమైన హింస, భయం, విధ్వంసాన్ని ఎదుర్కొంటోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో ఏడాదిన్నర క్రితం జరిగిన కుట్ర తర్వాత దేశం భయాందోళనలకు గురైందని అన్నారు. ఎక్కడ చూసినా అణిచివేత ఉందని, స్వేచ్ఛ కనుమరుగైందని ఆమె మండిపడ్డారు. సంస్థలు బలహీనపడగా, మతతత్వ శక్తులు రెచ్చిపోతున్నాయని విమర్శించారు.

మహిళలపై హింస, లైంగిక వేధింపులు విపరీతంగా పెరిగాయని ఆమె ఆరోపించారు. బంగ్లాదేశ్ ఇప్పుడు రక్తంతో తడిసిన ప్రాంతంగా మారిందని వాపోయారు. సంక్షోభ సమయంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, హింసాత్మక పాలనకు ముగింపు పలకడానికి పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

దక్షిణాసియా ఫారెన్ కరస్పాండెట్స్ క్లబ్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ఈ మేరకు ఆడియో సందేశం ఇచ్చారు.

Sheikh Hasina
Bangladesh
Bangladesh political crisis
South Asia Foreign Correspondents Club

More Telugu News