Chandrababu Naidu: 2027 గోదావరి పుష్కరాలు: ఇప్పటినుంచే సిద్ధం కావాలన్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Focuses on Godavari Pushkaralu 2027 Preparations
  • 2027 గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
  • దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వ అంచనా
  • పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
  • కొత్తగా 139 ఘాట్లు నిర్మించాలని ప్రణాళిక రూపకల్పన
  • ఆరు జిల్లాల్లో ఘనంగా పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు
2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం అమరావతిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరగనున్నాయి. గోదావరి నది ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా మరో 139 ఘాట్లను నిర్మించాలని నిర్ణయించారు. దీనితో మొత్తం 373 ఘాట్లను నదీ తీరం వెంబడి సుమారు 9918 మీటర్ల పొడవున అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సమీక్షకు ముందు ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. తన హయాంలో మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించే అవకాశం రావడం తన అదృష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఈ ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనిత, నారాయణ, నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, బీసీ జనార్థన్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Godavari Pushkaralu 2027
Andhra Pradesh
Polavaram Project
Godavari River
Pushkaralu Ghats
AP Government
Tourism
Hindu Festival
River Festival

More Telugu News