Anupama Parameswaran: ఎట్టకేలకు విడుదలవుతున్న అనుపమ పరమేశ్వరన్ 'లాక్ డౌన్'

Anupama Parameswarans Lockdown finally releasing
  • జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానున్న అనుపమ పరమేశ్వరన్ 'లాక్‌డౌన్'
  • గతంలో రెండుసార్లు వాయిదా పడ్డ చిత్రం
  • కరోనా లాక్‌డౌన్ సమయంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కథ
  • రహస్య సమస్యతో సతమతమయ్యే అనిత పాత్రలో అనుపమ నటన
  • లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ ఉమెన్ సెంట్రిక్ సినిమాకు ఏఆర్ జీవా దర్శకత్వం
యువ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ డ్రామా 'లాక్‌డౌన్' విడుదలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఏఆర్ జీవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 30న థియేటర్లలో విడుదల కానుందని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు "ప్రతి విరామానికి ఒక అర్థం ఉంటుంది.. జనవరి 30న లాక్‌డౌన్ చిత్రం థియేటర్లలోకి వస్తోంది" అంటూ చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 5నే విడుదల కావాల్సి ఉండగా, చెన్నైతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, 'దిత్వా' తుపాను ప్రభావం కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత డిసెంబర్ 12న విడుదల చేయాలని భావించినప్పటికీ, అనివార్య కారణాల వల్ల అది కూడా సాధ్యపడలేదు. ప్రేక్షకుల భద్రత తమకు ముఖ్యమని పేర్కొంటూ అప్పట్లో లైకా సంస్థ సినిమాను వాయిదా వేసింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో ఈ నెలాఖరున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమ 'అనిత' అనే పాత్రలో కనిపిస్తుంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఇబ్బందులు పడుతూ, బయట అప్పుల కోసం ప్రయత్నించే ఓ యువతి కథగా ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చార్లీ, నిరోషా, లివింగ్‌స్టన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎన్ఆర్ రఘునందన్, సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించగా, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇప్పటికే 'యూ/ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.


Anupama Parameswaran
Lockdown movie
AR Jeeva
Lyca Productions
Tamil movie release
Anita character
Lockdown drama
Tamil Nadu rains
Ditwa cyclone
Indian cinema

More Telugu News