Saina Nehwal: సైనా నెహ్వాల్ ఆట నుంచి తప్పుకోవడంపై సీఎం చంద్రబాబు స్పందన

Chandrababu Reacts to Saina Nehwal Retirement
  • సైనా నెహ్వాల్ మనందరికీ గర్వకారణమన్న ఏపీ సీఎం చంద్రబాబు
  • భారత బ్యాడ్మింటన్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని కితాబు
  • ఆమె పట్టుదల యువ క్రీడాకారులకు నిత్య స్ఫూర్తి అని వెల్లడి
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ ఆట నుంచి తప్పుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. భారత క్రీడా రంగానికి ఆమె చేసిన సేవలను కొనియాడుతూ ఎక్స్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. సైనా నెహ్వాల్ సాధించిన విజయాలు దేశానికే గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు.

"సైనా నెహ్వాల్‌ను చూసి మనమంతా ఎంతో గర్విస్తున్నాం. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఆమె ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. మన బ్యాడ్మింటన్‌ను ప్రపంచ పటంలో సగర్వంగా నిలిపిన ఘనత ఆమె సొంతం. సైనా కఠోర శ్రమ, పట్టుదల, ఆమె సాధించిన విజయాలు ఒక చెరగని ముద్ర వేశాయి. ఇవి ఎంతోమంది యువ క్రీడాకారులు రాకెట్ పట్టుకుని కోర్టులో అడుగుపెట్టేలా స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. బ్యాడ్మింటన్‌కు మీరు చేసిన సేవలకు ధన్యవాదాలు సైనా. రిటైర్మెంట్ తర్వాత మీరు చేపట్టబోయే పనులు విజయవంతం కావాలని, మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను" అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, మోకాలి గాయాల కారణంగా ఇక ఆడలేనంటూ సైనా నెహ్వాల్ పరోక్షంగా బ్యాడ్మింటన్‌కు గుడ్ బై చెప్పడం తెలిసిందే. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి క్రీడా దిగ్గజాలు కూడా సైనా సేవలను కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి భారతీయ బ్యాడ్మింటన్ ముఖచిత్రాన్ని మార్చిన సైనా.. తన నిర్ణయంతో అభిమానులను కాస్త నిరాశకు గురిచేసినా, భారత బ్యాడ్మింటన్ రంగంలో ఆమె ఘనమైన వారసత్వం మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది.


Saina Nehwal
Chandrababu Naidu
Saina Nehwal retirement
Indian Badminton
Andhra Pradesh CM
Badminton legend
Sports retirement
London Olympics
Pullela Gopichand

More Telugu News