Perni Nani: జగన్ ఫొటోను తీసేయడం తప్ప కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు: పేర్ని నాని

Perni Nani Criticizes Chandrababus Land Survey
  • చంద్రబాబు చేపట్టిన భూసర్వే ఓ దిక్కుమాలిన సర్వే అన్న పేర్ని నాని
  • కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త పాస్‌బుక్ అయినా ఇచ్చిందా అని ప్రశ్న
  • జగన్ చేపట్టిన సమగ్ర భూ సర్వేలో ఎలాంటి లోపాలు లేవని వ్యాఖ్య

చంద్రబాబు చేపట్టిన భూ సర్వే దిక్కుమాలిన సర్వే అంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రైతులకు ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరించిందా అని ప్రశ్నించారు. జగన్ హయాంలో చేపట్టిన సమగ్ర భూ సర్వేనే ఇప్పుడు చంద్రబాబు అనుసరిస్తున్నారని అన్నారు. 


తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. జగన్ హయాంలో ఇచ్చిన పాస్‌బుక్‌లపై మంత్రి అనగాని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వే చేసి ఒక్క కొత్త పాస్‌బుక్ అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. జగన్ హయాంలో ఇచ్చిన పాస్‌బుక్‌లను తీసుకుని, కేవలం అందులో ఉన్న జగన్ ఫొటోను తీసేయడమే తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రెవెన్యూ మంత్రికి రెవెన్యూ వ్యవస్థపై కనీస అవగాహన ఉందా అని నిలదీశారు.


1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రైతుల ఇబ్బందులపై ఎప్పుడైనా ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. తక్కెళ్లపల్లిలో కూటమి ప్రభుత్వం ప్రారంభించిన సర్వే ఎందుకు ముందుకు సాగడం లేదని నిలదీశారు. జగన్ చేపట్టిన సమగ్ర భూ సర్వేలో ఎలాంటి లోపాలు లేవని, ఆ సర్వేనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫాలో అవుతోందని అన్నారు.

జగన్ హయాంలో ఆరు వేల గ్రామాల్లో సమగ్ర భూ సర్వే పూర్తయిందని గుర్తు చేశారు. ఆ సర్వేకు ఉపయోగించిన పరికరాలే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వినియోగిస్తోందని తెలిపారు. సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ శాఖ కలిసి ఏపీలో ఆధునిక సాంకేతికతతో భూ సమగ్ర సర్వే నిర్వహించిందన్నారు. డ్రోన్ ప్లే డేటా, ఓఆర్‌ఐ కాపీలు, శాటిలైట్ లింక్ వంటి అత్యాధునిక సాంకేతికతతో జగన్ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే ప్రపంచంలోనే అద్భుతమైనదని పేర్ని నాని స్పష్టం చేశారు.

Perni Nani
Chandrababu Naidu
YS Jagan
Andhra Pradesh
Land Survey
YSRCP
Passbooks
Revenue Department
Tadepalli
AP Politics

More Telugu News