నా పరిస్థితే ఇలా ఉంటే కార్యకర్తల గతేంటి?: హోం మంత్రి అనితపై జేసీ అసంతృప్తి

  • తన గన్ లైసెన్స్ రెన్యూవల్ చేయడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణ
  • ఎన్ని లేఖలు రాసినా హోం మంత్రి అనిత స్పందించడం లేదని వ్యాఖ్య
  • ఇది ఎమ్మెల్యేను, తనను అవమానించడమేనని జేసీ ఆవేదన
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా సొంత పార్టీకి చెందిన హోం మంత్రి వంగలపూడి అనితపైనే ఆయన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తన గన్ లైసెన్సును రెన్యూవల్ చేయడం లేదంటూ మంత్రి తీరుపై అసహనం వ్య‌క్తం చేశారు. ఎన్నిసార్లు లేఖలు రాసినా హోం మంత్రి పట్టించుకోవడం లేదని, ఇది తనను, స్థానిక ఎమ్మెల్యేను అవమానించడమేనని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. "నాకు ఈ రోజు గన్‌మెన్లు లేరు. హోం మంత్రికి ఎన్నిసార్లు లెటర్లు రాసినా పట్టించుకోలేదు. మీరు నన్ను, ఎమ్మెల్యేను అవమానిస్తున్నారు. మాకు కూడా బాధలు ఉంటాయి. అనితమ్మా.. ఇది నా తప్పో, నీ తప్పో, పోలీసుల తప్పో తెలియదు కానీ, ఇది ఎమ్మెల్యేకు జరిగిన అవమానం" అని వ్యాఖ్యానించారు.

గన్ లైసెన్సులు కూడా రెన్యూవల్ చేసుకోలేని దుస్థితిలో ఉన్నామని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. "నా పరిస్థితే ఇలా ఉంటే ఇక పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏమిటి?" అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కనీసం తమ వినతులను కూడా పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. 


More Telugu News