ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, రాధాకిషన్ రావులను కలిపి విచారిస్తున్న సిట్

  • సిట్ విచారణకు హాజరైన కేటీఆర్, రాధాకిషన్ రావు
  • జూబ్లీహిల్స్ పీఎస్ లో కొనసాగుతున్న విచారణ
  • ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నట్టు సమాచారం

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు ఈ ఉదయం కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సిట్ ఎదుట హాజరయ్యారు. జాయింట్ సీపీ విజయ్‌కుమార్, ఏసీపీ వెంకటగిరి ఆయనను ప్రశ్నిస్తున్నారు.


ఈ విచారణకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే, ఈ కేసులో ఏ3గా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కూడా సిట్ అధికారులు అదే పీఎస్‌కు విచారణకు పిలిపించారు. ప్రస్తుతం కేటీఆర్‌, రాధాకిషన్ రావులను ఎదురెదురుగా కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నట్లు సమాచారం.


ఇదివరకు విచారణ సందర్భంగా “పెద్దాయన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగింది” అంటూ రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆ ‘పెద్దాయన’ ఎవరు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన అసలు ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్న దానిపై సిట్ అధికారులు లోతైన కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది.


ఇవాళ్టి విచారణలో బయటపడే అంశాల ఆధారంగా ఈ కేసు దిశ మారే అవకాశం ఉండటంతో, బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి పెరుగుతోంది.



More Telugu News