Chandrababu Naidu: దావోస్ నుంచి రాగానే పని మొదలుపెట్టిన చంద్రబాబు

Chandrababu Naidu Starts Work Immediately After Returning From Davos
  • ఈ ఉదయం రాష్ట్రానికి చేరుకున్న చంద్రబాబు
  • వెంటనే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్న వైనం
  • రాష్ట్ర ఆర్థిక పురోగతి, రుణాల అమలు, బ్యాంకుల సహకారం వంటి కీలక అంశాలపై చర్చ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌ పర్యటన ముగించుకుని ఈ ఉదయం రాష్ట్రానికి చేరుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న ఆయన విశ్రాంతి కూడా తీసుకోకుండానే పని మొదలుపెట్టారు. సచివాలయానికి వెళ్లి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశంలో పాల్గొన్నారు. సీఎం అధ్యక్షతన జరిగిన 233, 234వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పురోగతి, రుణాల అమలు, బ్యాంకుల సహకారం వంటి కీలక అంశాలపై చర్చించారు.


ఈ సమావేశంలో ముఖ్యంగా వార్షిక రుణ ప్రణాళిక అమలు పరిస్థితి, వ్యవసాయ రుణాలు, ఎంఎస్‌ఎంఈలకు అందుతున్న ఫైనాన్షియల్ సపోర్ట్‌పై సీఎం సమీక్షించారు. ఇప్పటివరకు బ్యాంకులు వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.2.96 లక్షల కోట్ల రుణాలు అందించినట్లు అధికారులు వివరించారు. అలాగే కౌలు రైతులకు రూ.1,490 కోట్ల మేర రుణాలు, ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.95,714 కోట్ల రుణాలు మంజూరైనట్లు తెలిపారు.


ఈ సందర్భంగా అమరావతిని ఫైనాన్షియల్ హబ్‌గా తీర్చిదిద్దే అంశంపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టిసారించారు. రాజధానిలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (CBD) ఏర్పాటుపై బ్యాంకర్లతో సీఎం కీలక చర్చలు జరిపారు. పెట్టుబడులు, బ్యాంకింగ్ సేవలు, కార్పొరేట్ కార్యకలాపాలకు అమరావతిని కేంద్రంగా మార్చే దిశగా బ్యాంకులు సహకరించాలని సూచించారు.


ఏపీ టిడ్కో రుణాలు, డ్వాక్రా సంఘాల బ్యాంక్ లింకేజీ, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, స్టార్టప్‌లకు బ్యాంకుల మద్దతు వంటి అంశాలపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.


ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, చీఫ్ సెక్రటరీ విజయానంద్, యూనియన్ బ్యాంక్ ఎండీ, ఆర్‌బీఐ ప్రాంతీయ డైరెక్టర్, నాబార్డు జీఎంతో పాటు వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ డైరెక్టర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Chandrababu Naidu
Andhra Pradesh
Davos
SLBC
Amaravati
Financial Hub
MSME
Agriculture Loans
Banking Sector
TIDCO

More Telugu News