Donald Trump: సైనిక చర్య తప్పదు: హమాస్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
- గాజాలో శాంతి స్థాపన కోసం శాంతి మండలి ఏర్పాటు
- శాంతి మండలి ప్రారంభ ఛైర్మన్ గా ట్రంప్
- హమాస్ నిరాయుధీకరణ విషయంలో రాజీ ఉండదన్న ట్రంప్
గాజా అంశంలో హమాస్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆయుధాలు వదిలిపెట్టేందుకు అంగీకరించకపోతే సైనిక చర్య తప్పదని స్పష్టంగా తేల్చిచెప్పారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా, గాజాలో శాంతి స్థాపన లక్ష్యంగా 35 దేశాల మద్దతుతో ‘శాంతి మండలి (Peace Board)’ని ట్రంప్ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్, హమాస్ నిరాయుధీకరణ విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదన్నారు. కొత్తగా రూపొందించిన శాంతి మార్గదర్శకాల్లో ఇది మొదటి అజెండా అని తెలిపారు. ఆయుధాలు వదిలే వరకు ఒత్తిడి కొనసాగుతుందని, అంగీకారం రాకపోతే సైనిక చర్యకు వెనుకాడబోమని హెచ్చరించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక యుద్ధాలకు ముగింపు పలికానని, త్వరలోనే మరో కీలక పరిష్కారం వెలుగులోకి వస్తుందని వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్ యుద్ధం విషయానికి వస్తే, దాన్ని పరిష్కరించడం ఇప్పటివరకు అత్యంత క్లిష్టమైన సమస్యగా మారిందని ట్రంప్ చెప్పారు. అయితే గాజాలో శాంతి సాధనకు ఈ కొత్త శాంతి మండలి కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, ఆహ్వానం ఉన్నప్పటికీ భారత్ సహా కొన్ని కీలక దేశాలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి. అయితే ఈ చార్టర్‌పై సంతకం చేసిన దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు, భద్రత సమన్వయం, పునర్నిర్మాణం వంటి అంశాల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ శాంతి మండలికి ప్రారంభ చైర్మన్‌గా ట్రంప్ వ్యవహరిస్తారని ప్రకటించారు. బహ్రెయిన్, మొరాకో, అజర్‌బైజాన్ నాయకులతో కలిసి ఆయన చార్టర్‌పై సంతకాలు చేశారు. ఈ మండలి గొప్ప విజయాలు సాధించగల సామర్థ్యం ఉందని, దీనికి నాయకత్వం వహించడం తనకు గర్వకారణమని ట్రంప్ పేర్కొన్నారు.
గాజా పునర్నిర్మాణంలో శాంతి మండలి కీలక పాత్ర పోషిస్తుందని, అయితే ఇందుకు ఐక్యరాజ్యసమితితో (యూఎన్) కలిసి పనిచేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. గతంలో యూఎన్‌పై విమర్శలు చేసిన ట్రంప్, ఈ సందర్భంలో మాత్రం సమన్వయంతో ముందుకెళ్లాలని పిలుపునివ్వడం విశేషం. ఈ శాంతి మండలి ఏర్పాటు ప్రకాశవంతమైన పశ్చిమాసియా దిశగా వేసిన తొలి అడుగు అని ఆయన అభివర్ణించారు.
శాంతి మండలి ఏర్పాటుపై అంతర్జాతీయంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేరే అవకాశాలపై ఆందోళనతో బ్రిటన్ ఈ మండలిలో చేరేందుకు నిరాకరించింది. నార్వే, స్వీడన్ కూడా దూరంగా ఉండనున్నట్లు సంకేతాలు ఇచ్చాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ పాల్గొనడాన్ని తిరస్కరించడంతో, ఫ్రెంచ్ వైన్‌పై 200 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ గతంలో హెచ్చరించిన విషయం చర్చనీయాంశమైంది. మరోవైపు, భాగస్వామ్య దేశాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని రష్యా ప్రకటించింది.