Sarita Maske: శివసేన (యూబీటీ)లో ఉత్కంఠకు తెర.. తిరిగొచ్చిన 'మిస్సింగ్' కార్పొరేటర్

Sarita Maske Returns to Shiv Sena UBT Ending Speculation
  • 24 గంటలుగా అందుబాటులో లేని కార్పొరేటర్ సరిత మస్కే తిరిగి రాక 
  • పార్టీ అధినేత ఉద్ధవ్‌తో భేటీ, అధికారిక రిజిస్ట్రేషన్‌పై సంతకం
  • తాను ఉద్ధవ్ థాకరేతోనే ఉంటానని స్పష్టం చేసిన సరిత
  • షిండే వర్గంలోకి వెళ్తారన్న ఊహాగానాలకు తెర
  • మతపరమైన పర్యటన వల్లే అందుబాటులో లేనని వెల్లడి
మహారాష్ట్ర రాజకీయాల్లో 24 గంటలుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) పార్టీకి చెందిన కార్పొరేటర్ సరిత మస్కే, పార్టీ మారతారన్న ఊహాగానాలకు తెరదించుతూ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. "నేను ఉద్ధవ్ థాకరేతోనే ఉన్నాను, ఎప్పటికీ ఆయనతోనే ఉంటాను" అని ఆమె స్పష్టం చేశారు. బుధవారం నుంచి అందుబాటులో లేకుండా పోవడంతో ఆమె ఏక్‌నాథ్ షిండే వర్గంలోకి వెళ్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

పార్టీ ముఖ్య నేత, ఎమ్మెల్సీ మిలింద్ నర్వేకర్ చొరవతో సరిత మస్కే, ఆమె భర్త బుధవారం రాత్రి తిరిగి పార్టీ నాయకత్వంతో టచ్‌లోకి వచ్చారు. గురువారం ఉదయం మిలింద్ నర్వేకర్‌తో కలిసి పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే నివాసం 'మాతోశ్రీ'కి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం, కొంకణ్ డివిజనల్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి బీఎంసీలో పార్టీ గ్రూప్ సభ్యురాలిగా అధికారిక పత్రాలపై సంతకం చేశారు.

తన అజ్ఞాతంపై సరిత వివరణ ఇస్తూ "అంతా తప్పుడు ప్రచారం. నేను మొక్కు తీర్చుకోవడానికి ధారాశివ్‌లోని తులజాపూర్ ఆలయానికి వెళ్లాను. పార్టీ సమావేశం గురించి నాకు ఆలస్యంగా సమాచారం అందింది. అందుకే హాజరు కాలేకపోయాను. నగరానికి తిరిగి రాగానే సీనియర్ నేతలను కలిసి నేను పార్టీతోనే ఉన్నానని చెప్పాను" అని తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని పార్టీ సీనియర్లే సూచించారని ఆమె పేర్కొన్నారు.

బుధవారం శివసేన భవన్‌లో జరిగిన 65 మంది కార్పొరేటర్ల సమావేశానికి సరిత ఒక్కరే గైర్హాజరు కావడంతో ఈ హైడ్రామా మొదలైంది. సరిత తిరిగి రావడంతో "చివరకు అంతా మంచే జరిగింది" అని మిలింద్ నర్వేకర్ వ్యాఖ్యానించారు. తాజా పరిణామంతో, బీఎంసీలో శివసేన (యూబీటీ)కి చెందిన 65 మంది కార్పొరేటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.
Sarita Maske
Uddhav Thackeray
Shiv Sena UBT
Maharashtra Politics
Milind Narvekar
BMC Corporator
Tuljapur Temple
Eknath Shinde
Marathi News
Political Drama

More Telugu News