Bangladesh: టీ20 వరల్డ్ కప్‌కు గుడ్‌బై.. బంగ్లాకి ఎన్ని వందల కోట్ల రూపాయల నష్టమో తెలుసా?

Bangladesh Cricket Board faces huge loss for T20 World Cup boycott
  • భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించిన బంగ్లాదేశ్
  • ఐసీసీ హెచ్చరికలను సైతం లెక్కచేయని బీసీబీ
  • ఈ నిర్ణయంతో సుమారు రూ. 240 కోట్ల ఆదాయం కోల్పోనున్న బంగ్లా
  • భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్ కూడా రద్దయ్యే ప్రమాదం
  • వార్షిక ఆదాయంలో 60 శాతం నష్టపోయే అవకాశం
క్రికెట్ ప్రపంచంలో బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ వేదికగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరిస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధికారికంగా ప్రకటించింది. భారత్‌కు తమ జట్టును పంపేది లేదని ముందునుంచీ చెబుతున్న బంగ్లాదేశ్.. ఈ విషయంలో ఐసీసీ హెచ్చరికలను కూడా పక్కన పెట్టింది.

ఇటీవల 16 సభ్య దేశాలతో జరిగిన సమావేశంలో ఐసీసీ ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. భారత్‌లో ఆడేందుకు నిరాకరిస్తే, టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి మరో జట్టును తీసుకుంటామని స్ప‌ష్టం చేసింది. అయినప్పటికీ, బంగ్లా బోర్డు తన నిర్ణయానికే కట్టుబడింది. ఈ బహిష్కరణ నిర్ణయం వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది.

పీటీఐ కథనం ప్రకారం ఈ ఒక్క నిర్ణయంతో బంగ్లాదేశ్ బోర్డు సుమారు 27 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 240 కోట్లు) నష్టపోనుంది. ప్రపంచకప్‌లో పాల్గొనకుంటే ఐసీసీ నుంచి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా కోల్పోతుంది. ఇది మాత్రమే కాకుండా ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్ ద్వారా వచ్చే ఆదాయానికి కూడా భారీగా గండి పడనుంది. దీంతో బీసీబీ తన వార్షిక ఆదాయంలో దాదాపు 60 శాతం నష్టపోతుందని అంచనా.

ఈ పరిణామాల ప్రభావం ఇక్కడితో ఆగకపోవచ్చు. ఈ ఏడాది చివర్లో భారత్‌తో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ కూడా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సిరీస్ రద్దయితే, బంగ్లాదేశ్ ఏడాది పొడవునా ఆడే 10 ఇతర సిరీస్‌ల ద్వారా వచ్చే ఆదాయంతో సమానమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. మొత్తంగా ఈ నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్‌ను ఆర్థికంగా, క్రీడాపరంగా తీవ్రంగా దెబ్బతీయనుంది.
Bangladesh
Bangladesh Cricket Board
T20 World Cup
ICC
Bangladesh cricket
cricket boycott
financial loss
sports revenue
India
Bilateral series
BCB

More Telugu News