Revanth Reddy: హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి.. రూ.5,000 కోట్లతో ఏఐ డేటా సెంటర్

Revanth Reddy Secures 5000 Crore AI Data Center Investment for Hyderabad
  • ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు
  • రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న యూపీసీ వోల్ట్ సంస్థ
  • దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వంతో నెదర్లాండ్స్ కంపెనీల జాయింట్ వెంచర్ ఒప్పందం
  • ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 3,800 ఉద్యోగాల కల్పన
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. హైదరాబాద్ శివార్లలోని 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రెడీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. నెదర్లాండ్స్‌కు చెందిన యూపీసీ రెన్యూవబుల్స్, వోల్ట్ డేటా సెంటర్స్ జాయింట్ వెంచర్ అయిన యూపీసీ వోల్ట్ సంస్థ.. ఐదేళ్లలో రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఈ మేరకు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) జరిగింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం.. యూపీసీ వోల్ట్ ప్రతినిధులు హాన్ డి గ్రూట్, స్టీవెన్ జ్వాన్‌లతో సమావేశమై ఈ ఒప్పందాన్ని ఖరారు చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్‌ కోసం 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేకంగా ఒక పునరుత్పాదక ఇంధన ప్లాంట్‌ను కూడా ఇదే సంస్థ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా నెట్-జీరో లక్ష్యాలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ఒప్పందంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. "2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే 'తెలంగాణ రైజింగ్' లక్ష్యమని, అందులో డిజిటల్ మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తాయని సీఎం పేర్కొన్నారు." అధునాతన ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహకాలు కల్పిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 3,000 మందికి, కార్యకలాపాలు ప్రారంభమయ్యాక 800 మంది నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ పెట్టుబడితో హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసినట్లయింది.
Revanth Reddy
Telangana
Hyderabad
AI Data Center
UPC Volt
Data Center Investment
Renewable Energy
Sridhar Babu
World Economic Forum
Bharat Future City

More Telugu News