Cyber Crime: వలపు వలకు చిక్కి రూ.2.14 కోట్లు పొగొట్టుకున్న హైదరాబాద్ టెక్కీ

Cyber Crime Hyderabad Techie Loses Rupees 214 Crore in Online Fraud
  • సోషల్ మీడియాలో పరిచయమైన మహిళ మాయలో టెక్కీ
  • ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం
  • విడతలవారీగా రూ.2.14 కోట్లు బదిలీ చేయించిన కేటుగాళ్లు
  • అప్పులు చేసి, ఆస్తులు అమ్మి డబ్బు కట్టిన బాధితుడు
  • మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సైబర్ మోసగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయాడు. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ మహిళ చెప్పిన మాయమాటలు నమ్మి, నకిలీ ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టి ఏకంగా రూ.2.14 కోట్లు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది.

సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం, టీఎన్‌జీవో కాలనీకి చెందిన 44 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి గతేడాది డిసెంబరులో సోషల్ మీడియా ద్వారా ఓ మహిళ పరిచయమైంది. తాను స్టాక్ ట్రేడింగ్‌లో భారీగా లాభాలు గడిస్తున్నట్లు నమ్మించింది. ఆమె మాటలు విశ్వసించిన బాధితుడి చేత ఓ నకిలీ ట్రేడింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించింది.

డిసెంబర్ 12న తొలిసారిగా రూ.31.5 లక్షలు పెట్టుబడి పెట్టగా, యాప్‌లో భారీగా లాభాలు కనిపించాయి. దీంతో మరింత పెట్టుబడి పెడితే ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయని ఆ మహిళ ఆశ చూపింది. ఆమెను నమ్మి రెండోసారి రూ.42.27 లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత లాభాలను విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, వచ్చిన లాభంలో 30 శాతం పన్ను యూఏఈ ప్రభుత్వానికి కట్టాలని మోసగాళ్లు మెలిక పెట్టారు.

యాప్‌లో కనిపిస్తున్న వర్చువల్ లాభాలను నిజమని నమ్మిన బాధితుడు, ఆఫీసు సహోద్యోగుల నుంచి రూ.90 లక్షలు అప్పు తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల నుంచి డబ్బు సేకరించి, కొన్ని ఆస్తులను కూడా అమ్మి మొత్తం 8 విడతల్లో రూ.2.14 కోట్లు వారికి పంపాడు. చివరకు డబ్బు విత్‌డ్రా కోసం ప్రయత్నించగా, అదనంగా మరో రూ.68 లక్షలు కట్టాలని చెప్పడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు.

వెంటనే అప్రమత్తమైన బాధితుడు, ఆ మహిళ ఫొటోను ఇంటర్నెట్‌లో వెతకగా, అది ఇన్‌స్టాగ్రామ్‌లోని వేరొకరి ప్రొఫైల్ నుంచి దొంగిలించిందని తేలింది. దీంతో తాను నకిలీ ప్రొఫైల్‌తో మోసపోయానని నిర్ధారించుకుని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.





Cyber Crime
Hyderabad
Cyberabad police
Online fraud
Stock trading
Fake trading app
Social media fraud
Financial fraud
T NGO Colony
UAE government

More Telugu News