Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు
- జగన్ పాదయాత్ర ప్రకటనపై నిమ్మల విమర్శలు
- అధికారం కోల్పోయిన తర్వాత పాదయాత్ర గుర్తొచ్చిందని ఎద్దేవా
- రాష్ట్రంలో వైసీపీ శకం ముగిసిందని వ్యాఖ్య
రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నట్టు వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ... విమర్శలు గుప్పించారు. ఏపీలో వైసీపీ శకం పూర్తిగా ముగిసిందని అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాతే జగన్‌కు పాదయాత్ర గుర్తొచ్చిందంటూ ఎద్దేవా చేశారు. ఐదేళ్ల పాటు మొద్దు నిద్రలో ఉన్న జగన్ ఇప్పుడు పాదయాత్ర పేరుతో మరోసారి డ్రామాకు తెరతీశారని విమర్శించారు.
పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏనుగువానిలంక గ్రామంలో నిమ్మల పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 10.92 కోట్ల వ్యయంతో కాజ మేజర్ డ్రైన్‌పై అవుట్‌ఫాల్స్ స్లూయిస్ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే యలమంచిలి నుంచి బాడవ వరకు గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.
గత ఐదేళ్లలో గోదావరి వరదల కారణంగా వేలాది ఎకరాల పంటలు నష్టపోయాయని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో అధికారులు వచ్చి వెళ్లారే తప్ప, కాజ మేజర్ డ్రైన్ అవుట్‌ఫాల్స్ స్లూయిస్ పనులకు మాత్రం మోక్షం కలగలేదన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాకే ఈ పనులకు శంకుస్థాపన జరిగిందని స్పష్టం చేశారు.
రైతుల కష్టాలు తెలుసుకుని పనిచేసే ప్రభుత్వం తమదేనని నిమ్మల రామానాయుడు తెలిపారు. సాగునీటి సమస్యలు, ముంపు బాధలను శాశ్వతంగా పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జగన్ పాదయాత్రలకే పరిమితమైతే, తాము పనులతో ప్రజలకు జవాబు ఇస్తామని నిమ్మల స్పష్టం చేశారు.