Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh requests Accenture CSO for Global Delivery Center in Vizag
  • దావోస్ పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ కీలక భేటీలు
  • విశాఖలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయాలని యాక్సెంచర్‌కు ప్రతిపాదన
  • ఏపీ విద్యార్థులకు ప్రత్యేక కోర్సుల కోసం కేంబ్రిడ్జి వర్సిటీతో చర్చలు
  • టెక్నాలజీ, విద్యారంగాల్లో భాగస్వామ్యం కావాలని అంతర్జాతీయ సంస్థలకు విజ్ఞప్తి
  • ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం చెబుతామన్న సంస్థల ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ పెట్టుబడులు, ప్రతిష్ఠాత్మక సంస్థల భాగస్వామ్యాలు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ దావోస్ పర్యటనలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. తన పర్యటనలో నాలుగో రోజు ఆయన టెక్నాలజీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture), ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు, విద్యాభివృద్ధికి ఉన్న అవకాశాలను వారికి వివరించి, కీలక ప్రతిపాదనలు ముందుంచారు.

విశాఖలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయండి
ముందుగా, యాక్సెంచర్ చీఫ్ స్ట్రాటజీ & సర్వీస్ ఆఫీసర్ (సీఎస్ఓ) మనీష్ శర్మతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో తమ గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఇక్కడి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులను సద్వినియోగం చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్, డిజిటల్ కార్యకలాపాలకు విశాఖను కేంద్రంగా మార్చుకోవాలని సూచించారు. ఏపీలో నైపుణ్యాభివృద్ధికి తమ 'ఫ్యూచర్ రైట్ స్కిల్స్ నెట్‌వర్క్' ద్వారా సహకారం అందించి, సంస్థకు అవసరమైన వర్క్‌ఫోర్స్‌ను తయారు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి క్వాంటం వ్యాలీ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) లలో భాగస్వామ్యం కావాలని కూడా ఆహ్వానించారు.

దీనిపై మనీష్ శర్మ స్పందిస్తూ.. ఏఐ టాలెంట్ అభివృద్ధిపై తమ సంస్థ భారీగా పెట్టుబడులు పెడుతోందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 80,000 మంది ఏఐ నిపుణులను తయారు చేయడమే లక్ష్యమని, ఇందులో ఎక్కువ భాగం భారత్‌పైనే దృష్టి సారించామని వివరించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఏపీ విద్యార్థులకు కేంబ్రిడ్జి కోర్సులు
అనంతరం, కేంబ్రిడ్జి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డెబ్బీ ప్రెంటిస్‌తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8-10 తరగతుల విద్యార్థులకు వాతావరణ మార్పులు, సుస్థిరత, భవిష్యత్ నైపుణ్యాలపై కేంబ్రిడ్జి సర్టిఫైడ్ ఆన్‌లైన్ కోర్సులను ప్రారంభించాలని కోరారు. 

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలతో కలిసి జాయింట్ రీసెర్చ్, కరిక్యులమ్ డెవలప్‌మెంట్, ఫ్యాకల్టీ ఎక్స్‌ఛేంజ్ కార్యక్రమాల కోసం ఒప్పందం చేసుకోవాలని ప్రతిపాదించారు. ఆంధ్రా యూనివర్సిటీ, ఐఐటీ తిరుపతి వంటి సంస్థలతో కలిసి ఏఐ, డేటా సైన్స్ వంటి అధునాతన రంగాల్లో పరిశోధనలు చేపట్టే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రతిపాదనలపై స్పందించిన డెబ్బీ ప్రెంటిస్, భారత్‌లో తాము ఇప్పటికే క్లైమేట్ ఎడ్యుకేషన్, డిజిటల్ స్కిల్స్‌పై దృష్టి సారించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని, త్వరలోనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు.

Nara Lokesh
Andhra Pradesh
Accenture
Global Delivery Center
Visakhapatnam
Cambridge University
AI talent
Skill development
Investments AP
Education

More Telugu News