: భార్యను చూడడానికి వెళ్లిన యువకుడిని కాల్చి చంపేశారు.. మణిపూర్ లో ఆగని హింస.. వీడియో ఇదిగో!

  • చేతులు జోడించి ప్రార్థించినా కనికరించని వైనం
  • మెయితీ యువకుడిని కిడ్నాప్ చేసి కాల్చి చంపిన కుకీలు
  • కుకీ తెగకు చెందిన తన భార్యను కలుసుకోవడానికి వెళ్లిన యువకుడు
  • ముందుగా తెగ నాయకుల నుంచి అనుమతి తీసుకున్నానని చెబుతున్న మహిళ
మణిపూర్ లో మరో ఘోరం చోటుచేసుకుంది.. మెయితీలు, కుకీ తెగల మధ్య దాడులు ఆగడంలేదు. తాజాగా, కుకీ తెగకు చెందిన తన భార్యను కలుసుకోవడానికి వెళ్లిన మెయితీ యువకుడిని దుండగులు కాల్చి చంపారు. ఈ నెల 21న యువకుడిని కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మృతుడు నేపాల్ లో పనిచేస్తున్నాడని, ఇటీవల రాష్ట్రంలో జరిగిన అల్లర్లతో అతడికి సంబంధం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

మెయితీ సామాజిక వర్గానికి చెందిన మయాంగ్లబామ్ రిషికాంత సింగ్ అనే యువకుడు కుకీ సామాజిక వర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. మణిపూర్ లో ఇటీవలి అల్లర్లకు ముందు వీరి వివాహం జరిగింది. కాక్చింగ్ ఖునో గ్రామానికి చెందిన రిషికాంత కొంతకాలంగా నేపాల్ లో పనిచేస్తున్నాడు. ఇటీవల సెలవుపై గ్రామానికి వచ్చిన రిషికాంత.. పుట్టింట్లో ఉన్న భార్యను కలుసుకోవడానికి చురాచంద్ పూర్ జిల్లాలోని గ్రామానికి వెళ్లాడు. ఇటీవలి అల్లర్ల నేపథ్యంలో రిషికాంత భార్య కుకీ నేషనల్ ఆర్గనైజేషన్ పెద్దలను సంప్రదించి తన భర్త రాకకు ముందస్తు అనుమతి తీసుకున్నట్లు తెలిపింది.

దీంతో రిషికాంత ధైర్యంగా అత్తగారింటికి వెళ్లాడు. అయితే, కుకీ తెగకు చెందిన కొంతమంది దుండగులు రిషికాంతను కిడ్నాప్ చేసి గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. రాత్రిపూట చీకట్లో రిషికాంతను ప్రశిస్తూ కాల్చి చంపారు. చేతులు జోడించి కన్నీళ్లతో తనను వదిలిపెట్టాలని రిషికాంత వేడుకుంటున్నా కనికరించలేదు. ఇటీవలి అల్లర్లకు తనకు సంబంధంలేదని, కొన్నేళ్లుగా తాను నేపాల్ లోనే ఉంటున్నానని చెప్పినా వినిపించుకోలేదు. రిషికాంతపై కాల్పులు జరపడం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘నో పీస్ నో పాపులర్ గవర్నమెంట్’ అంటూ రిషికాంత మృతదేహం పడి ఉన్న ఫొటోపై రాసి ఈ పోస్టుకు జోడించారు.

More Telugu News