ఓటీటీ తెరపైకి తెలుగులో 'ధురంధర్'

  • డిసెంబర్ 5వ తేదీన విడుదలైన 'ధురంధర్'
  • తొలి షోతోనే దక్కిన హిట్ టాక్
  • రికార్డు స్థాయిలో 1300 కోట్ల వసూళ్లు
  • ఓటీటీ హక్కులు దక్కించుకున్న 'నెట్ ఫ్లిక్స్' 
  • ఈ నెల 30 నుంచి వివిధ భాషల్లో అందుబాటులోకి 

ఈ మధ్య కాలంలో సినీ అభిమానులు ఎక్కువగా మాట్లాడుకున్న సినిమాలలో 'ధురంధర్' ముందు వరుసలో నిలుస్తుంది. ఎక్కడ చూసినా ఈ సినిమాకి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. పోస్టర్స్ నుంచే హైప్ తీసుకొచ్చిన ఈ సినిమా, విడుదల తరువాత సంచలనానికి సరైన అర్థం చెప్పింది. రణ్ వీర్ సింగ్ కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా ఇది మార్కులు కొట్టేసింది. బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల జాబితాలో ఒకటిగా ఇది నిలిచిపోయింది.

డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలి ఆట నుంచే తన జోరును చూపించడం మొదలుపెట్టింది. ఈ మధ్య కాలంలో సీనియర్ స్టార్స్ తో.. భారీ బడ్జెట్ తో  కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే అవి ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాయి. అలాగే ఇది కూడా భారీతనంతో సందడి చేసే ఒక సినిమా అనుకున్నారు. కానీ బలమైన కథాకథనాలు .. ప్రతి పాత్రకి ఒక ప్రయోజనం ఉండటంతో అసలైన విజయంతో ఈ సినిమా దూసుకుపోయింది. 1300 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. 

ఈ సినిమాకి తెలుగు వెర్షన్ వస్తుందేమోనని ఎదురు చూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. అందరూ ఇంతలా మాట్లాడుకుంటున్న ఈ సినిమాలో అసలు ఏముంది?అనే ఆసక్తి తెలుగు ప్రేక్షకులలో పెరుగుతూ పోతోంది. అలాంటి ఈ సినిమా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించనుండటం విశేషం. ఈ నెల 30వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను 280 కోట్లకు 'నెట్ ఫ్లిక్స్' వారు దక్కించుకున్నట్టుగా చెబుతున్నారు. హిందీతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ను ఈ సినిమా ఏ స్థాయిలో షేక్ చేస్తుందనేది చూడాలి మరి. 



More Telugu News