Shashi Tharoor: ప్రధాని తర్వాత అత్యంత కఠినమైన జాబ్ గంభీర్‌దే: శశి థరూర్

Gautam Gambhir Job Toughest After PM Says Shashi Tharoor
  • నాగ్‌పూర్‌లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో శశి థరూర్ భేటీ
  • నిరంతరం ఒత్తిడిలోనూ గంభీర్ ప్రశాంతంగా ఉంటారని ప్రశంస
  • థరూర్ ప్రశంసలకు ధన్యవాదాలు తెలిపిన గంభీర్
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉద్యోగాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రధానమంత్రి తర్వాత అత్యంత కఠినమైన బాధ్యత గంభీర్‌దేనని ఆయన పేర్కొన్నారు. థరూర్ ప్రశంసలపై గంభీర్ స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.

నిన్న‌ నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన‌ తొలి టీ20 మ్యాచ్‌కు ముందు గంభీర్‌తో థరూర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పంచుకున్నారు. "నా పాత స్నేహితుడు, ప్రధాని తర్వాత భారతదేశంలో అత్యంత కఠినమైన ఉద్యోగంలో ఉన్న గౌతమ్ గంభీర్‌తో నాగ్‌పూర్‌లో మంచి చర్చ జరిగింది" అని థరూర్ తన పోస్టులో పేర్కొన్నారు. 

నిరంతరం లక్షలాది మంది నుంచి విమర్శలు ఎదుర్కొంటూ, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పటికీ గంభీర్ ప్రశాంతంగా, ధైర్యంగా ముందుకు సాగుతారని ప్రశంసించారు. గంభీర్ నాయకత్వ పటిమను కొనియాడుతూ, రాబోయే సిరీస్‌లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

థరూర్ పోస్టుకు గంభీర్ 'ఎక్స్' వేదికగా బదులిచ్చారు. "చాలా ధన్యవాదాలు డాక్టర్ శశి థరూర్! కోచ్‌కు ఉండే అపరిమిత అధికారాల గురించి ఉన్న అపోహలు, నిజానిజాలు కాలక్రమేణా స్పష్టమవుతాయి. అప్పటివరకు, నా వాళ్లే నాకు వ్యతిరేకంగా నిలబడటం చూసి ఆశ్చర్యపోతున్నాను" అని గంభీర్ తన పోస్టులో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
Shashi Tharoor
Gautam Gambhir
Team India Head Coach
Indian Cricket Team
Cricket Coach Job
Nagpur
India vs New Zealand
T20 Match
Cricket Criticism
Indian Politics

More Telugu News