అలాంటి సినిమాలు కలెక్షన్లు వసూలు చేయలేవని చాలామంది నిర్మాతలు భావిస్తుంటారు: మాళవిక మోహనన్

  • నిర్మాతల ఆలోచన మారాలన్న మాళవిక 
  • మహిళా కథలకు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి తగ్గడం వల్లనే అలాంటి సినిమాలు అరుదుగా వస్తున్నాయని వెల్లడి
  • నిర్మాతల ఆలోచనకు ‘కొత్తలోక: చాప్టర్ 1’ గట్టి సమాధానం ఇచ్చిందన్న మాళవిక
మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు వసూళ్లు సాధించలేవని పలువురు నిర్మాతలు భావిస్తున్నారని, ఈ విషయంలో వారి ఆలోచనా ధోరణి మారాలని నటి మాళవిక మోహనన్ అభిప్రాయపడ్డారు. గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన చిన్న చిత్రాల్లో ‘కొత్తలోక: చాప్టర్ 1’ ఒకటి. తక్కువ వ్యయంతో రూపొందినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా నటి మాళవిక మోహనన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహిళా ప్రధాన చిత్రాలపై నిర్మాతల దృక్పథం గురించి మాట్లాడారు.

మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలకు వసూళ్లు రావనే భావన చాలా మంది నిర్మాతల్లో ఉందని, అందుకే కథానాయికలు ప్రధాన పాత్రల్లో నటించే చిత్రాలను అధిక బడ్జెట్‌తో నిర్మించడానికి ముందుకు రారని ఆమె అన్నారు. మహిళా కథలకు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపకపోవడం వల్లనే అలాంటి సినిమాలు అరుదుగా వస్తున్నాయని మాళవిక పేర్కొన్నారు.

అయితే ఈ ఆలోచనకు ‘కొత్తలోక: చాప్టర్ 1’ గట్టి సమాధానం చెప్పిందని ఆమె అన్నారు. యువ నటి ప్రధాన పాత్రలో నటించినప్పటికీ, ఆ చిత్రం రికార్డులు సృష్టించిందని, బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లు సాధించిందని తెలిపారు. కల్యాణి ప్రియదర్శన్ ఆ పాత్రకు న్యాయం చేస్తుందనే నమ్మకంతోనే దర్శక నిర్మాతలు ముందుకు వెళ్లారని, అందుకే ఇంత పెద్ద విజయం సాధ్యమైందని ఆమె అన్నారు.

గతేడాది ఆగస్టులో విడుదలైన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి మలయాళ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే. కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ వేదిక ‘జియో హాట్‌స్టార్’లో ప్రసారం అవుతోంది. 


More Telugu News