జగద్గిరిగుట్టలో ఘోరం... దివ్యాంగురాలిని చంపేపి, ఆత్మహత్యాయత్నం చేసిన ముగ్గురు కుటుంబ సభ్యులు

  • ఆర్థిక ఇబ్బందులు తాళలేక సామూహిక ఆత్మహత్యకు యత్నించిన సతీశ్ కుమార్ కుటుంబం
  • కుమారుడు నితీశ్ స్నేహితుడికి ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి
  • ముందుగా పుట్టుకతోనే దివ్యాంగురాలిగా ఉన్న కుమార్తె శ్రీజావళి(18)ని హతమార్చిన సతీశ్‌కుమార్‌, ఆమని దంపతులు 
కుత్బుల్లాపూర్ పరిధిలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఒక కుటుంబం సామూహిక ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న సతీశ్ కుమార్, ఆయన భార్య ఆమని, కుమారుడు నితీశ్, కుమార్తె శ్రీజావళితో కలిసి జీవిస్తున్నారు. కొంతకాలంగా ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మనోవేదనకు గురైన సతీశ్ దంపతులు, రెండు రోజుల క్రితం పుట్టుకతోనే దివ్యాంగురాలైన తమ కుమార్తె శ్రీజావళి (18)ని హతమార్చినట్లు సమాచారం.

ఆ తరువాత, మిగిలిన ముగ్గురు మృతదేహంతోనే రెండు రోజులుగా ఇంట్లోనే ఉన్నారు. బుధవారం నాడు వారు చేతులు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా, కుమారుడు నితీశ్ ఈ విషయాన్ని తన స్నేహితుడికి తెలియజేశాడు. అతను సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. 


More Telugu News