Donald Trump: దావోస్ వేదికగా భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని ప్రస్తావించిన ట్రంప్

Donald Trump on India Pakistan War at Davos
  • భారత్, పాకిస్థాన్ సహా ఎనిమిది యుద్ధాలను నిలువరించానన్న ట్రంప్
  • అర్మేనియా, అజర్‌బైజాన్ విభేదాలను ఒక్కరోజులో పరిష్కరించానన్న ట్రంప్
  • రష్యా అధ్యక్షుడు పుతిన్ నమ్మలేకపోయారని వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా భారత్, పాకిస్థాన్ యుద్ధంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్‌తో సహా అనేక యుద్ధాలను తాను ఆపానని ఆయన పునరుద్ఘాటించారు. ఈ వేదికపై ఆయన సుమారు గంటకు పైగా ప్రసంగించారు. గత సంవత్సరం మే నెలలో నాలుగు రోజుల పాటు జరిగిన భారత్, పాకిస్థాన్ యుద్ధంతో సహా ఎనిమిది యుద్ధాలను నిలువరించానని పేర్కొన్నారు. అయితే ఈ యుద్ధంలో మూడవ పక్షం జోక్యం లేదని భారత్ మొదటి నుంచి చెబుతోంది.

స్విట్జర్లాండ్‌లోని అందమైన దావోస్ నగరానికి మళ్లీ రావడం ఆనందంగా ఉందని, వ్యాపారవేత్తలను, చాలామంది స్నేహితులను, కొంతమంది శత్రువులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నానంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. తాను ఎన్నో యుద్ధాలను ఆపగలిగానని పేర్కొన్నారు. ఆర్మేనియా, అజర్‌బైజాన్ మధ్య విభేదాలను కూడా పరిష్కరించానని అన్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ తనకు ఫోన్ చేసి, "మీరు కొన్ని యుద్ధాలను ఆపారంటే నమ్మలేకపోతున్నాను" అని వ్యాఖ్యానించినట్లు వెల్లడించారు. 35 ఏళ్లుగా ఆర్మేనియా, అజర్‌బైజాన్ మధ్య ఉన్న గొడవలను ఒక్కరోజులో పరిష్కరించినట్లు చెప్పారు.

"ఆ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి నేను పదేళ్లుగా ప్రయత్నం చేస్తున్నాను. కానీ పరిష్కరించలేకపోయాను" అని పుతిన్ తనతో చెప్పారని అన్నారు.

ఆ విషయం తనకు వదిలేసి తనకు ఒక్క సహాయం చేసి పెట్టాలని పుతిన్‌ను తాను కోరానని అన్నారు. మీ యుద్ధంపై (ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ఉద్దేశించి) దృష్టి సారించాలని తాను కోరానని, మిగతా వాటి గురించి ఆలోచించవద్దని చెప్పానని అన్నారు.

అమెరికాలో తన పాలన గురించి మాట్లాడుతూ, గడిచిన ఏడాది కాలంలో ఎన్నో మంచి పనులు చేశానని అన్నారు. తమ నుంచి కెనడా ఎన్నో ఉచితాలు పొందుతోందని తెలిపారు. ప్రతి దేశం తమతో కలిసి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎవరినీ నాశనం చేయాలనే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. అయితే పన్నులు చెల్లించకపోవడంతో ఏర్పడిన వాణిజ్య లోటును తిరిగి చెల్లించాల్సిందేనని ఆయన అన్నారు.
Donald Trump
India Pakistan war
Davos
World Economic Forum
India
Pakistan
Vladimir Putin

More Telugu News