Ranganath: సరూర్ నగర్ చెరువును టేకోవర్ చేసుకుంటాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

Ranganath HYDRA to Take Over Sarurnagar Lake Restoration
  • ముఖ్యమంత్రి ఆదేశాలతో చెరువును పునరుద్ధరిస్తామన్న హైడ్రా కమిషనర్
  • 150 ఎకరాల చెరువు 90  ఎకరాలకు పరిమితమైందని వెల్లడి
  • గతంలో జరిగిన నిర్మాణాల జోలికి వెళ్లమని హైడ్రా కమిషనర్ హామీ
సరూర్ నగర్ మినీ ట్యాంక్‌బండ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సరూర్ నగర్ చెరువును పునరుద్ధరిస్తామని ఆయన అన్నారు. బుధవారం ఆయన సరూర్ నగర్ చెరువును పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, సుమారు 150 ఎకరాల్లో ఉండే ఈ చెరువు ప్రస్తుతం 90 ఎకరాలకు పరిమితమైందని అన్నారు. గతంలో జరిగిన నిర్మాణాల జోలికి వెళ్లకుండా ప్రస్తుతం ఉన్న 90 ఎకరాలను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

చెరువులోకి మురుగు నీరు రాకుండా చర్యలు చేపడతామని రంగనాథ్ తెలిపారు. చెరువు పూడికతీత కూడా చేపడతామని అన్నారు. ఇదివరకే హైడ్రా స్వాధీనం చేసుకున్న బతుకమ్మ కుంట ఎంత ఆహ్లాదకరంగా తయారయిందో చూశారని, సరూర్ నగర్ చెరువును కూడా ఏడాదిలో పునరుద్ధరిస్తామని ఆయన పేర్కొన్నారు.

కటోరా హౌస్ పున‌రుద్ధ‌ర‌ణ‌కు పూర్తి స‌హ‌కారం

గోల్కొండ కోట ప్రాంగ‌ణంలో చారిత్ర‌క క‌టోరా హౌస్ ప‌రిర‌క్ష‌ణకు హైడ్రా పూర్తి సహకారం అందిస్తుంద‌ని హైడ్రా క‌మిష‌నర్ రంగ‌నాథ్ తెలిపారు. 450 ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఈ నీటి వ‌నరును కాపాడేందుకు 'నిర్మాణ్' ఎన్‌జీవో ముందుకు వచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్కియాల‌జీ శాఖ సంర‌క్ష‌ణలో ఉన్న ఈ చెరువును హైడ్రా క‌మిష‌నర్ సంద‌ర్శించారు.

కటోరా హౌస్‌కు పూర్వ‌వైభ‌వం తెచ్చేందుకు స‌హక‌రించాల‌ని కోరిన నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌నర్ ప‌రిశీలించారు. ఈ నీటి వ‌నరును కాపాడేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌లను హైడ్రా క‌మిష‌నర్‌కు 'నిర్మాణ్' ఎన్‌జీవో త‌రఫున ప‌నులు ప‌ర్య‌వేక్షిస్తున్న క‌ల్ప‌నా ర‌మేశ్, ఆర్కియాల‌జీ విభాగం అధికారులు వివరించారు. నీటి ట్యాంక్‌లో చెత్త వేయ‌డానికి వీలు లేకుండా ఎత్తైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయ‌డంతో పాటు, చుట్టూ పాత్‌వే అభివృద్ధి చేయాల‌ని భావిస్తున్నట్లు వారు తెలిపారు.

ఈ చారిత్ర‌క నీటి వ‌నరులోంచి వేసిన మురుగునీటి పైపు లైనుకు ప్ర‌త్యామ్నాయం చూపేందుకు స‌హక‌రించాల‌ని హైడ్రా క‌మిష‌నర్‌ను వారు కోరారు. అభివృద్ధి ప‌నుల‌కు అడుగ‌డుగునా ఆటంకాలు ఏర్ప‌డుతున్నాయ‌ని, హైడ్రా స‌హకారంతో క‌టోరా హౌస్‌కు పూర్వ వైభ‌వం తీసుకువస్తామని వారు అన్నారు.

చారిత్ర‌క చెరువుల‌ను కాపాడ‌డంలో హైడ్రాకు ఉన్న అనుభ‌వం క‌టోరా హౌస్ అభివృద్ధికి దోహ‌దప‌డాల‌ని అభ్య‌ర్థించారు. జలాశయం పునరుద్ధరణకు హైడ్రా పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, అలాగే ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చారిత్రక జలవనరుల సంరక్షణ అత్యంత అవసరమని క‌మిష‌నర్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. దీని అభివృద్ధికి సంబంధించి కార్య‌క్ర‌మాల‌ను నివేదించాల‌ని 'నిర్మాణ్' ఎన్‌జీవో, ఆర్కియాల‌జీ విభాగం అధికారుల‌ను క‌మిష‌నర్ కోరారు.
Ranganath
Ranganath HYDRA
Sarurnagar Lake
Mini Tank Bund
Telangana Lakes
Katora House

More Telugu News