ఐరోపా సరైన దిశలో వెళ్లడం లేదు: దావోస్ వేదికగా డొనాల్డ్ ట్రంప్

  • ఐరోపాలో వలసలపై నియంత్రణ లేదన్న ట్రంప్
  • తన పాలనలో అమెరికా అభివృద్ధి పథంలో సాగుతుందన్న ట్రంప్
  • దేశంలో ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసినట్లు వెల్లడి
ఐరోపా సరైన దిశలో పయనించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐరోపాలో వలసలపై సరైన నియంత్రణ లేదని అన్నారు. తన పాలనలో అమెరికా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, దేశంలో ద్రవ్యోల్భణాన్ని అదుపులోకి తెచ్చామని ఆయన వెల్లడించారు.

ప్రపంచ ఆర్థిక ఇంజిన్‌గా అమెరికా నిలుస్తోందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. వివిధ దేశాలపై సుంకాల విధించడం ద్వారా తమ వాణిజ్య లోటును గణనీయంగా తగ్గించామని ఆయన తెలిపారు. వెనెజువెలాకు ఇప్పుడు సమర్థవంతమైన కొత్త నాయకత్వం లభించిందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా తప్ప మరే ఇతర దేశం కూడా సురక్షితంగా ఉంచలేదని ఆయన స్పష్టం చేశారు. గ్రీన్‌లాండ్ కొనుగోలుపై తక్షణమే చర్చలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

డెన్మార్క్‌పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. డెన్మార్క్ కృతజ్ఞత లేని దేశమని ఆయన అభివర్ణించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత గ్రీన్‌ల్యాండ్‌ను తిరిగి అప్పగించడం అమెరికా చేసిన పొరపాటని ఆయన అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ చేతిలో ఓడిపోయిన డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌ను కాపాడుకోలేకపోయిందని ఆయన గుర్తు చేశారు. డెన్మార్క్ మరియు గ్రీన్‌లాండ్ ప్రజల పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు.


More Telugu News