Kalvakuntla Kavitha: కేటీఆర్ అలా చెబుతుంటే నవ్వు వచ్చింది: సోదరుడిపై కవిత విమర్శలు

Kalvakuntla Kavitha Criticizes KTRs Secunderabad District Demand
  • సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయమని కేటీఆర్ డిమాండ్ చేయడంపై విమర్శ
  • పదేళ్లు అధికారంలో ఉండి సికింద్రాబాద్ కోసం ఉద్యమించిన వారిని జైల్లో వేశారని ఆరోపణ
  • ఈరోజు కేటీఆర్ జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తుంటే నవ్వు వస్తోందని వ్యాఖ్య
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విమర్శలు చేశారు. సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయాలని కేటీఆర్ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సేవ్ సికింద్రాబాద్' ర్యాలీకి కేటీఆర్ మద్దతు తెలిపారు.

సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయాలన్న కేటీఆర్ డిమాండ్‌పై కవిత స్పందిస్తూ, "కేటీఆర్ సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయాలని ఉద్యమిస్తుంటే నాకు నవ్వు వస్తోంది. సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయాలని డిమాండ్ చేసిన వారిని పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అణిచివేశారు, జైళ్లలో వేశారు. కానీ, ఇప్పుడు కేటీఆర్ వెళ్లి సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయమని మాట్లాడుతున్నారు" అని విమర్శించారు.

మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై కవిత స్పష్టత

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేసే విషయమై కవిత మాట్లాడుతూ, జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అన్నారు. అయితే, ఎన్నికల్లో మద్దతు కావాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, యువత, మహిళలు కోరితే అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారు మున్సిపల్ ఎన్నికలను ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు రాజకీయాల్లోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు.
Kalvakuntla Kavitha
Kavitha
KTR
BRS
Telangana Jagruthi
Secunderabad
Telangana
Municipal Elections

More Telugu News