Udayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్‌ను తప్పుపట్టిన మద్రాస్ హైకోర్టు
- సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- ఉదయనిధి వ్యాఖ్యలు జాతి విధ్వంసాన్ని సూచించేలా ఉన్నాయన్న హైకోర్టు
- ఉదయనిధి వ్యాఖ్యలు కేవలం అభిప్రాయం కాదన్న ధర్మాసనం
సనాతన ధర్మంపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను మద్రాస్ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. సనాతన ధర్మంపై సోషల్ మీడియాలో ఉదయనిధి చేసిన పోస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఉదయనిధి ఉపయోగించిన భాష జాతి విధ్వంసాన్ని సూచించేలా ఉందని, ఇది సాధారణ వ్యాఖ్య కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలు ద్వేషపూరిత ప్రసంగానికి సమానమని స్పష్టం చేసింది. సనాతన ధర్మాన్ని ఒక మతంగా పరిగణిస్తే, ఆ మతాన్ని అనుసరించే వారు ఉండకూడదని చెప్పడం మతహత్యకు పిలుపునిచ్చినట్లే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంటే అది కేవలం అభిప్రాయం కాదని, మతాన్ని, సంస్కృతిని నాశనం చేసే పిలుపుగా మారుతుందని కోర్టు పేర్కొంది. సోషల్ మీడియాలో వాడిన పదాలు స్పష్టంగా జాతి నిర్మూలన, సాంస్కృతిక విధ్వంసాన్ని సూచిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది.
ఉదయనిధి వ్యాఖ్యలను విమర్శించినందుకు బీజేపీ నేత అమిత్ మాలవీయపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. మంత్రి వ్యాఖ్యలకు ప్రతిస్పందించడం తప్పు కాదని కోర్టు స్పష్టం చేసింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.