Ayyanna Patrudu: అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు... నో పే!: అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu Calls for No Work No Pay for Absent MLAs
  • స్పీకర్ల మహాసభలో అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు
  • 'నో వర్క్.. నో పే' విధానం అమలు చేయాలన్న అయ్యన్న
  • సభకు రాకుండా జీతాలు తీసుకోవడం సరికాదని వ్యాఖ్య

వైసీపీ ఎమ్మెల్యేలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు ‘నో వర్క్.. నో పే’ విధానం అమలు చేయాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన స్పీకర్ల మహాసభలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల పట్ల శాసన వ్యవస్థకు ఉన్న జవాబుదారీతనం అంశంపై అయ్యన్నపాత్రుడు కీలక ప్రసంగం చేశారు.


ఎమ్మెల్యేలు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులని, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం వారి ప్రాథమిక బాధ్యత అని స్పీకర్ గుర్తు చేశారు. ప్రజలు నమ్మకంతో ఎన్నుకుని పంపిన ప్రతినిధులు సభకు రాకుండా జీతాలు తీసుకోవడం సరికాదని స్పష్టంగా చెప్పారు. శాసనసభ కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడే ప్రజల సమస్యలు చర్చకు వస్తాయని అన్నారు. ఈ అంశంపై లోక్‌సభ స్పీకర్‌తో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అయ్యన్నపాత్రుడు కోరారు. శాసనసభ వ్యవస్థను మరింత బాధ్యతాయుతంగా మార్చాలంటే ఇలాంటి సంస్కరణలు తప్పనిసరిగా అవసరమని అభిప్రాయపడ్డారు.


ఎమ్మెల్యేల హాజరు తప్పనిసరిగా ఉండేలా ‘నో వర్క్.. నో పే’ విధానం అమలైతే, శాసనసభ పనితీరు మెరుగుపడుతుందని, ప్రజల విశ్వాసం మరింత బలపడుతుందని స్పీకర్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. 

Ayyanna Patrudu
Andhra Pradesh Assembly
AP Assembly
No Work No Pay
MLA Attendance
Legislative Assembly
Speaker Comments
YSRCP MLAs
Assembly Sessions
Public Accountability

More Telugu News