Khawaja Asif: ఫేక్ ఔట్ లెట్ ను ప్రారంభించిన పాక్ రక్షణ మంత్రి.. వీడియో ఇదిగో!

Khawaja Asif Opens Fake Pizza Hut Outlet in Pakistan
  • సియాల్ కోట్ లో ఘనంగా పిజ్జా హట్ ఔట్ లెట్ ప్రారంభోత్సవం.. రిబ్బన్ కట్ చేసిన మంత్రి
  • అది ఫేక్ ఔట్ లెట్ అని, దాంతో తమకు సంబంధంలేదంటూ పిజ్జా హట్ వివరణ
  • ప్రపంచంలో పాక్ కు మాత్రమే ఇలాంటి పనులు సాధ్యమని నెటిజన్ల సెటైర్
పాకిస్థాన్ మరోసారి నవ్వులపాలైంది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పిజ్జా హట్ కు పాక్ లోని సియాల్ కోట్ లో ఓ ఔట్ లెట్ తెరుచుకుంది! ఏకంగా దేశ రక్షణమంత్రి దీనికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. సియాల్ కోట్ లో ఓ ఔట్ లెట్ ప్రారంభిస్తున్నట్లు పిజ్జా హట్ యాజమాన్యానికే తెలియకపోవడం. ఈ వీడియోలపై పిజ్జా హట్ స్పందిస్తూ.. సియాల్ కోట్ లో తమ సంస్థ ఔట్ లెట్ ప్రారంభించలేదని, వైరల్ గా మారిన ఔట్ లెట్ ఫేక్ అని ఓ ప్రకటనలో వెల్లడించింది.

అసలేం జరిగిందంటే..
సియాల్ కోట్ లో పిజ్జా హట్ ఔట్ లెట్ ప్రారంభించాలని దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ను నిర్వాహకులు ఆహ్వానించారు. దీంతో వెనకాముందు చూసుకోకుండా ఆసిఫ్ అంగీకరించారు. మాటిచ్చినట్లే ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రిని పూలతో ఆహ్వానించిన నిర్వాహకులు.. అందంగా అలంకరించిన ఔట్ లెట్ కు రిబ్బన్ కట్ చేయించి ప్రారంభోత్సవం చేయించారు. ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారడంతో పిజ్జా హట్ యాజమాన్యం స్పందించింది.

పిజ్జా హట్ ఫిర్యాదు..
మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రారంభించిన ఔట్ లెట్ తమది కాదని, తమ బ్రాండ్ నేమ్ వాడుకుంటూ తెరిచిన ఫేక్ ఔట్ లెట్ అని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన జారీ చేసింది. తమ ట్రేడ్‌మార్క్‌ను దుర్వినియోగం చేసి, అక్రమంగా తమ పేరు వాడుకుంటున్నారని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. ఈ విషయం గమనించాలంటూ తమ కస్టమర్లకు సూచనలు చేసింది. దీంతో ఫేక్ ఔట్ లెట్ ను ప్రారంభించిన మంత్రి ఖవాజా ఆసిఫ్ నవ్వుల పాలయ్యారు. ఈ వీడియోలపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇలాంటివి ప్రపంచంలో కేవలం పాకిస్థాన్ లో మాత్రమే సాధ్యమంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు.
Khawaja Asif
Pizza Hut
Sialkot
Pakistan
Fake Outlet
Defense Minister
Social Media
Viral Video
Fraud
Trademark Infringement

More Telugu News