చిరంజీవి సినిమాలో కృతి శెట్టి

  • కమర్షియల్ హిట్ లేకపోవడంతో వెనుకబడ్డ కృతిశెట్టి
  • చిరంజీవి, దర్శకుడు బాబి సినిమాలో ఆఫర్ వచ్చినట్టు సమాచారం
  • ఇదే నిజమైతే కెరీర్ ట్రాక్‌లో పడినట్టే

సినిమాల్లో ఒక హిట్‌ కొట్టడం కంటే ఆ హిట్‌ను కొనసాగిస్తూ అవకాశాలు దక్కించుకోవడమే అసలైన సవాల్‌. ఈ విషయాన్ని చాలా మంది హీరోహీరోయిన్ల కెరీర్‌ స్పష్టంగా చెబుతుంది. ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్న హీరోయిన్ కృతిశెట్టి గురించి టాలీవుడ్‌లో మళ్లీ చర్చ మొదలైంది.


‘ఉప్పెన’ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ తెచ్చుకున్న కృతి... ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా ఆశించిన స్థాయి విజయాలు మాత్రం దక్కలేదు. మంచి నటిగా గుర్తింపు ఉన్నప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద హిట్‌ లేకపోవడంతో ఆమె కెరీర్‌ కొంత స్లో అయిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆమెకు మరోసారి భారీ అవకాశం దక్కినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.


ఇటీవలే ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి... తన తదుపరి సినిమాకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు బాబీతో చిరు మరోసారి కలిసి పనిచేయనున్నారు. ఈ సినిమా ఈ నెలలో లాంచ్‌ అయ్యే అవకాశముండగా, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం.


ఈ ప్రాజెక్ట్‌లో కృతిశెట్టికి కీలక పాత్ర ఇచ్చినట్టు టాక్‌ వినిపిస్తోంది. అయితే చిరంజీవి సరసన హీరోయిన్‌గా కాదు, ఆయన కుమార్తె పాత్రలో కృతి కనిపించనుందనే సమాచారం వినిపిస్తోంది. కథ మొత్తం ఫాదర్–డాటర్‌ సెంటిమెంట్‌ చుట్టూ తిరుగుతుందని, బెంగాల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ సాగుతుందని చెబుతున్నారు.


ఇక ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ ఓ ముఖ్యమైన పాత్రలో నటించనున్నారన్న ప్రచారం కూడా ఉంది. చిరంజీవికి జోడీగా ప్రియమణిని ఎంపిక చేసినట్టు, సంగీత దర్శకుడిగా ఏఆర్‌ రెహమాన్‌ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ అంశాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే... కృతిశెట్టికి ఇది కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లో పెట్టే మెగా ఛాన్స్‌ అవుతుందని చెప్పొచ్చు.



More Telugu News