KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్

KTR Condemns Attack on BRS MLA Vijaya
  • అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిపై దాడి
  • దాడికి పాల్పడిన మల్లు రవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని మండిపాటు

అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడిపై దాడిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. విజయుడిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి చేసిన ఈ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్‌ నేతలు దిగజారిన రాజకీయానికి పాల్పడుతున్నారనడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు.


ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానిస్తూ శారీరక దాడికి దిగడమనేది... కాంగ్రెస్‌ ఎంత దిగజారిందో స్పష్టంగా చూపుతోందని కేటీఆర్‌ మండిపడ్డారు. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని మండిపడ్డారు. ఈ దాడిని బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు సీఎం రేవంత్‌ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాదు, ప్రజల తీర్పుతోనే ఎదుర్కోవాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతుల్లో గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.


ఘటన వివరాల్లోకి వెళితే... జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడ్‌ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. భూమిపూజలో ముందుగా ఎంపీ కొబ్బరికాయ కొట్టగా, అనంతరం ఎమ్మెల్యే పనులు ప్రారంభించేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో అలంపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొబ్బరికాయ కొట్టేందుకు ముందుకు రావడంతో ప్రోటోకాల్‌ లేని వ్యక్తులతో ఎలా కార్యక్రమం నిర్వహిస్తారని ఎంపీని, ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇది వివాదానికి దారి తీసింది.
KTR
BRS
KTR slams attack
Mallu Ravi
Alampur MLA
Vijaya
Telangana politics
Revanth Reddy
Congress party
Attack on MLA

More Telugu News