AP Government: భూముల మార్కెట్ విలువను మరోసారి పెంచిన ఏపీ ప్రభుత్వం

AP Government Hikes Land Market Values Again
  • రెండోసారి భూముల మార్కెట్ విలువను పెంచిన కూటమి ప్రభుత్వం
  • సవరించిన మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి
  • రూ. 13,150 కోట్లకు పైగా ఆదాయం రావచ్చని అంచనా

ఆంధ్రప్రదేశ్‌లో భూముల మార్కెట్ విలువలను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. సవరించిన భూముల మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ మెమో జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి భూముల మార్కెట్ విలువల పెంపు కావడం గమనార్హం. గత ఏడాది కొత్త జిల్లాలు, వాణిజ్య ప్రాంతాలు, అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం 15 శాతం కంటే ఎక్కువగా పెంచిన విషయం తెలిసిందే.


భూముల మార్కెట్ విలువలు పెరగడం వల్ల ప్రభుత్వానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం ద్వారా రూ.13,150 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు ఇది కీలక ఆదాయ వనరుగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.


ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ముఖ్యంగా పట్టణాలు, వాణిజ్య కేంద్రాలు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో భూముల కొనుగోలు–విక్రయాల సమయంలో ఎక్కువ స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, దీర్ఘకాలంలో భూముల ధరలు పెరగడం వల్ల ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఈ నిర్ణయం కీలకంగా నిలుస్తుందని వారు పేర్కొంటున్నారు.

AP Government
Andhra Pradesh
land market value
real estate
property registration
stamp duty
revenue department
Sai Prasad
real estate market
property value

More Telugu News